తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, స్పీకర్  కోడెల శివ ప్రసాదరావు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.   మొన్నటి పోలింగ్ అయ్యేంత వరకూ  తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహారాలు సాగించుకున్న వాళ్ళల్లో కోడెల కూడా ఒకరు.  రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో కూడా తెలీని సమయంలో కోడెల హెచ్ఆర్ఏ వ్యవహారం వెలుగు చూసింది. ఆ విషయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తాజాగా దృష్టి సారించినట్లు సమాచారం.

 

చంద్రబాబునాయుడుతో సంబంధం లేకుండానే ఎన్నికల కమీషన్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని సిఎస్ గా నియమించింది. దాంతో చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ఇటు ఎల్వీతో పాటు అటు ఈసిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఎల్వీ కూడా చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలను అమలు కాకుండా ఆపేస్తున్నారు. దాంతో చంద్రబాబు అండ్ కో ఎల్వీపై ఫుల్లుగా ఫైరవుతున్నారు.

 

ఇటువంటి నేపధ్యంలోనే  హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు నెం 7లొ ఓ భవనంకు కోడెల నెలకు లక్ష రూపాయలు ఇంటి అద్దె బత్యాన్ని తీసుకుంటున్నారన్న విషయం బయటపడింది. ఏపి అసెంబ్లీ స్పీకర్ గా ఉంటున్న కోడెల హైదరాబాద్ లో ఇంటి అద్దె అలవెన్సు ఎలా తీసుకుంటున్నారన్న విషయంలో దుమారం రేగుతోంది.

 

ఇక్కడ విషయం ఏమిటంటే కోడెల ఏ నివాసంలో అయితే ఉంటున్నట్లు చెప్పి హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారో అదే ఇంట్లో టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కు కొడుకు వీరేందర్ గౌడ్ ఓ ఆఫీసు నడుపుతున్నట్లు బయటపడింది. అంటే ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారు ? ఎవరి ఆఫీసుకు ఎవరు అద్దె కడుతున్నారు ?  ఎవరి నుండి ఎవరు అద్దె తీసుకుంటున్నారు ? అనే విషయాలు సస్పెన్స్ గా మారింది.

 

ఇపుడిదే విషయమై ఎల్వీ అసెంబ్లీ అధికారులకు ఓ లేఖ రాసారట. కోడెల హెచ్ఆర్ఏ తీసుకుంటున్న విషయమై వివరాలు అడిగారట. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐదేళ్ళ కాలానికి  కోడెల సుమారు రూ 60 లక్షలు దాకా హెచ్ఆర్ఏ తీసుకున్నారు. ఒకవేళ ఈ భవనానికి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగాయా అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం విచారిస్తోంది. ఏదైనా తేలితే మొత్తం రూ 60 లక్షలను కోడెల నుండి రికవరీ చేస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం తలచుకుంటే చీటింగ్ కేసు కూడా పెట్టవచ్చని తెలుస్తోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: