చదువు తప్ప ఏమి తెలియని పసి పిల్లలు సుమారు 19 మంది చనిపోవటమంటే చిన్న విషయం కాదు. కానీ ఆ పిల్లల ఆత్మహత్యలకు తెలంగాణ సర్కార్ స్పందించిన తీరు ఇంకా దురదృష్టకరం. మూడు లక్షల మందికి పైగానే విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విషయం విదితమే. అయితే, ప్రతి యేడాదీ ఇదే స్థాయిలో 'ఫెయిల్‌' విద్యార్థులుంటున్నారంటూ తొలుత ప్రభుత్వం నుంచి నిర్లక్ష్య పూరిత సమాధానం వచ్చినా, 'లెక్కలు అత్యంత దారుణంగా' మార్కుల లిస్ట్‌లో కన్పించడంతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇంటర్‌ బోర్డ్‌, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అత్యంత ప్రతిభగల విద్యార్థులు ఫెయిల్‌ కావడం ఓ వైపరీత్యమైతే, అంతకు మించిన దారుణం 17 మార్కులతో ఫెయిలయిన విద్యార్థిని 'పాస్‌' కోటాలోకి వేసెయ్యడం. ఇంతటి గందరగోళం కారణంగానే ఈసారి తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన తలనొప్పుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్‌ చొరవతో పోయిన ప్రాణాలు తిరిగిరావుగానీ, కొంతమేర విద్యార్థులు ఊరట పొందే అవకాశమైతే వుంది. కానీ, అత్యంత జుగుప్సాకరమైన ఈ తప్పిదం విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా స్పందించాల్సిందే.


విద్యా శాఖ మంత్రి సహా, కీలక అధికారులు చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలకూ తగిన 'శాస్తి' జరగాల్సి వుంది. మరి, కేసీఆర్‌ అంత సీరియస్‌ యాక్షన్‌ తీసుకోగలరా.? ఇక్కడితో ఈ ఇంటర్మీడియట్‌ రచ్చ చల్లారుతుందని అనుకోవచ్చా.? ఏమో, వేచి చూడాల్సిందే. ఏదిఏమైనా, ఇంటర్‌ బోర్డ్‌పైనా, ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగి వుంటే, చాలామంది విద్యార్థుల బలవన్మరణాలు ఆగేవేమో.!

మరింత సమాచారం తెలుసుకోండి: