ఏపీలో సాధారణ ఎన్నికలు ముగియడంతో ఆయా పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల నుంచి, పార్టీల అధినేతల వరకు ఒక్కటే సమీక్షలో మునిగి తేలుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అనుకూల పవనాలు వీస్తున్నాయని అంచనాలు ఎక్కువగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.  ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే తమ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా పూర్తి చేసేశారు. ఇక వైసిపి అధినేత జగన్ కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రత్యేకంగా పిలిపించుకుని ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ? జరిగింది వైసీపీ గెలుపు ఓటములు ఎలా  ?ఉన్నాయ‌ని ప్రత్యేకంగా గెలుపు అవకాశాలు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రధానంగా నెల్లూరు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులతో విడివిడిగా సమీక్షలు చేసినట్టు బోగట్టా.


ఈ క్రమంలోనే మూడు కీలక నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను పిలిపించుకున్న జగన్ వారితో ప్రత్యేకంగా సమీక్షలు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మంగళగిరి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్, నగరిలో పోటీ చేసిన వైసిపి లేడీ బ్రాండ్ ఆర్ కే రోజాతో జగన్ ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములపై లోతుగా స‌మీక్ష చేసి గెలుపు అవకాశాలపై చర్చించారు.  మంగళగిరిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేయడంతో అక్కడ వైసీపీకి గట్టిపోటీ ఎదురైంది. స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు రంగంలో ఉండడంతో అక్కడ టిడిపి వర్గాలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు మంగళగిరిలో లోకేష్ గెలుపు కోసం ప్రచారం చేశారు.


లోకేష్ గెలుపు కోసం అక్కడ టిడిపి వేసిన ఎత్తులు... పెట్టిన ఖర్చు చూస్తే టిడిపి గెలుపు వన్ సైడ్ కావాలి అయితే ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండటం... స్థానిక రైతులకు అండగా పోరాటాలు చేయడంతో మెజార్టీ వర్గాల్లో ఆయన వైపే మొగ్గు చూపాయి. ఇక నారా లోకేష్ ఎంత ఖర్చు చేసినా స్థానికేతరుడు కావటం... టిడిపి ఈ సీటును బీసీలకు ఇస్తానని చెప్పి చివర్లో లోకేష్‌కు ఇవ్వటం కూడా ఆర్కేకు ప్లస్ పాయింట్ అయింది.  ఇక వైసీపీకి భవిష్యత్తులో తిరుగులేని యంగ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నుంచి మంత్రి పొంగూరు నారాయణ బరిలోకి దిగారు. నారాయణ ఇక్కడి గెలిచేందుకు ఆపసోపాలు పడ్డారు. ధనవంతుడు కావడంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయితే స్థానికంగా ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా నగర నియోజకవర్గ ప్రజలు మరోసారి అనిల్ కుమార్ యాదవ్ కే పట్టం కట్టినట్టు పోలింగ్ సరళి చెబుతోంది. అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై సైతం జగన్ పూర్తి ధీమాతో ఉన్నట్టు స‌మాచారం.


ఇక జగన్ ప్రధానంగా దృష్టి సారించిన మూడో వ్యక్తి నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఇక్కడ రోజాను ఓడించేందుకు టీడీపీ నుంచి సరైన అభ్యర్థిని దింపటం చంద్రబాబుకు చివరకు సాధ్యం కాలేదు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో విభేదాలు రావడంతో నగరి టిడిపి అభ్యర్థి ఎవరన్నది చివరివరకు తేలలేదు. సొంత కుటుంబ సభ్యులే భాను ప్రకాష్ కు వ్యతిరేకంగా పనిచేయటం.. నగరి నియోజకవర్గంలో అధికంగా ఉన్న తమిళ ఓటర్లు రోజా వైపు నిలవడం... నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గం రోజా గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయడంతో ఇక్కడ రోజాకు తిరుగులేదని జగన్ కు అందిన నివేదికలో స్పష్టం అయింది. ఇదే విషయాన్ని జగన్ సైతం వెల్లడించి రోజా గెలుస్తుందని చెప్పటం విశేషం. ఏదేమైనా ఈ మూడు కీలక సీట్లు వైసిపి ఖాతాలో పడే విషయంపై జగన్ పూర్తి ధీమాతో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: