టీడీపీ నాయకులూ కింద పడిన మాదే పై చెయ్యి అనే రకం. వితండవాదం చేయటంలో వారికి మించినోళ్లు లేరు. అధికారం అనుభవించిన పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తే, అదేరోజు సాయంత్రం హుందాగా సీఎం అయితే గవర్నర్ ను కలిసి రాజీనామా ఇవ్వడం, ప్రధాని అయితే రాష్ట్రపతిని కలిసి రాజీనామా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాల రోజే అదంతా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం 'జూన్ ఎనిమిది' అనేమాట మాట్లాడుతూ ఉన్నారు.


తను ఐదేళ్ల కిందట ఆ రోజున ప్రమాణస్వీకారం చేసినట్టుగా, కాబట్టి తను ఈ జూన్ ఎనిమిది వరకూ తనే సీఎం అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. బాబే కాదు.. ఆ పార్టీ నేతలంతా జూన్ ఎనిమిది అనే పాట పాడుతున్నారు. వీరు కాస్తైనా ఆలోచించి అలా మాట్లాడుతున్నారా? అనే సందేహం ఇక్కడ రానే వస్తుంది. ఎందుకంటే, గత ఎన్నికల ఫలితాలు వచ్చిన చాలారోజుల తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కొంత విరామం అనంతరం ప్రమాణస్వీకారం ప్రోగ్రామ్ ను పెట్టుకున్నారాయన. అప్పటివరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. విభజన తర్వాత కిరణ్ సీఎంగా రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన వచ్చింది.


ఎన్నికలంతా అలాగే కొనసాగాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకు చివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అది జూన్ ఎనిమిదో తేదీన. ఫలితాలు వచ్చింది మాత్రం మే నెలలోనే. అది బాబు కావాలని తీసుకున్న విరామం. ముహూర్తాల కోసమో మరో దాని కోసమో జూన్ ఎనిమిదిని ఎంచుకున్నారు.  అంతేకానీ.. అది రాజ్యాంగబద్ధంగా 'ఐదేళ్లు' అని చెప్పేందుకు జూన్ ఎనిమిది ప్రామాణికం కాదు. ఈ ప్రాథమిక విషయాలను కూడా విస్మరించి తెలుగుదేశం వాళ్లు మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: