మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తీరు వేరు. మొదటి నుంచి ఆవేశంగా ఉండడం, సమాజం  పట్ల కొంత బాధ్యత అన్నట్లుగా వ్యవహరించడం జరుగుతూవచ్చింది. చిరంజీవి కంటే ముందే పవన్ రాజకీయాల పట్ల ఆసక్తిని మరో రూపంలో వ్యక్తపరచారు. 2007 టైంలో పవన్ కామన్ మ్యాన్ ప్రొటెక్టివ్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఆ మీదట చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం ఏర్పాటు చేశారు.


అయితే ప్రజారాజ్యం ఓ డిజాస్టర్ అయింది. చేదు అనుభవం మిగిల్చింది. పార్టీ పెట్టి  2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవికి కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెప్పుకోదగిన సీట్లు ఓట్లు వచ్చాయి. దాదాపు  18 శాతం ఓట్లు, సీట్లు లభించాయి. మొత్తానికి చూసుకుంటే  అటు వైఎస్సార్, ఇటు చంద్రబాబుని కాదని మూడవ పెద్ద ఫోర్స్ గా చిరంజీవి ఆ ఎన్నికలలో నిలిచారు. అయితే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అది ఓ పీడకలగా మారింది.


కాపులు ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఆశలు ముఖ్యమంత్రి పీఠం. దాన్ని చిరంజీవి నేరవేరుస్తారని అంతా అనుకున్నారు. అయితే ఛిరంజీవి చేసిన రాజకీయం, పార్టీని మూసేయడం నచ్చని జనాలు ఇప్పటికీ గోదావరి నిండా ఉన్నారు. వారి కోపం ఎంత అంటే ఇప్పటికీ ఆ ప్రభావం ఇంకా బలంగా ఉందని చెప్పడానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున పవన్ అభ్యర్ధులను పెట్టినా పెద్దగా నమ్మలేదని రాజకీయ విశ్లేషకులు అంటారు. 


ఒకపుడు మా పార్టీ అని ప్రజారాజ్యాన్ని మోసిన వారు తరువాత పరిణామాలు చూసి జనసేనకు పెద్దగా ఆదరించలేదని అంటారు. అందువల్లనే జనసేన టీడీపీ, వైసీపీల కంటే ఏపీలో మూడవ స్థానానికి పరిమితం కావాల్సివస్తోందని విశ్లేషిస్తారు. పవన్ సైతం సీరియస్ రాజకీయాలు చేసే నేతలా కనిపించకపోవడం, టీడీపీలో జనసేన లోపాయికారి ఒప్పందాలపై  ప్రచారం వంటివి కూడా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత మైనస్ చేస్తాయని అంటున్నారు. మొత్తానికి అన్న నీడ నుంచి ఎంత బయటకు  వచ్చానని పవన్ బాగా గట్టిగా  అనుకుంటున్నా నాటి పాపాలు శాపాలుగా జనసేనను పట్టి పీడిస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. మరి అసలు ఫలితాలు ఏం చెబుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: