తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఫలితాలు అధికార టీఆర్ఎస్‌కు వన్ సైడ్ గా అనుకూలంగా వచ్చాయో లేదో ? వెంటనే ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు క్యూ క‌ట్టేస్తున్నారు.  ఇక వచ్చే నెల 23న ఇటు ఏపీలో ఫలితాలు వచ్చిన వెంటనే ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీలోకి విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం అయిపోతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ తర్వాత పలు సర్వేలు, రాజకీయ నాయకుల విశ్లేషణల ప్రకారం ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది జగన్ సామాజికవర్గానికి చెందిన నేతలు అప్పుడే జగన్‌తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసిపి సత్తా చాటింది. ఆ ప్రాంతంలో ఏ మాత్రం బలంలేని టిడిపి సీమ జిల్లాల నుంచి భారీ ఎత్తున విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని నిస్సిగ్గుగా వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది.

ఇదిలా ఉంటే టిడిపి నుంచి గెలుస్తామన్న నమ్మకం ఉండి, తమ పార్టీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిన సీమ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు,  ఓ ఎంపీ అభ్యర్థి అప్పుడే పక్కచూపులు చూస్తున్నటు బోగట్టా. ఈ ఎన్నికల్లో సీమ ప్రాంతం నుంచి  పోటీ చేసిన ఓ రాజకీయ వారసుడు ఫలితాలు వచ్చిన వెంటనే గోడదూకేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఆ యువనేతకు వైసీపీ అధినేతతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదే విషయాన్ని ఆయన చాలా ఇంట‌ర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ మారితే తన స్నేహితుడి దగ్గర మ‌రి కాస్త విలువ కూడా పెరుగుతుందని ఎంపీ అభ్యర్థి భావిస్తున్నాడట.  తన పార్టీ మరి అంశంపై ఇప్పటికే సదరు ఎంపీ అభ్యర్థి సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


జగన్ ఇప్పటివరకు ఫిరాయింపులను ఎప్పుడు ప్రోత్సహించలేదు.  ఇప్పుడు కూడా ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ఆ పార్టీ ద్వారా గెలిచిన పదవులకు రాజీనామా చేసి మళ్లీ వైసీపీ సీటుపై పోటీ చేయాలన్న కండీష‌న్లే ఆయన పెడుతున్నారు.  2012లో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడు పెద్ద రిస్క్ చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి ఘ‌న‌విజ‌యం సాధించాడు. రెండు సంవత్సరాల క్రితం నంద్యాల ఉప ఎన్నిక సమయంలో  ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి సైతం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే జగన్ వైసీపీలోకి చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి  సీమ జిల్లాల నుంచి  టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడే వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.  వీరిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు జగన్ ఆయా జిల్లాలకు చెందిన త‌మ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. 


ఇప్పటి వరకు ఇతర పార్టీల టికెట్‌పై గెలిచిన నేతలను జ‌గ‌న్ వారు ఆ పదవులకు రాజీనామా చేశాకే వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఫిరాయింపులను ఎంక‌రేజ్ చేయడానికి ఆయ‌న సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏదేమైనా ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఫ్యాన్ కింద సేదతీరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సీమ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆ యువ‌నేత పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా...ఆ త‌ర్వాత లిస్టులో చాలా మంది ఎమ్మెల్యే క్యాండెట్లు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: