ఏపీలో పోలింగ్ ముగిశాక వ‌చ్చిన అంచ‌నాలు, ఆఫ్ ద రికార్డుగా వెలువ‌డుతోన్న స‌ర్వేలు అన్ని వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని చెపుతున్నాయ్‌. టీడీపీకి ఐదేళ్ల‌పాటు చ‌క్క‌గా భ‌జ‌న చేసిన ఎల్లోమీడియా సంస్థ‌లు సైతం ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌రోక్షంగా ఒప్పేసుకున్నాయి. టీడీపీలో చాలా మంది సీనియ‌ర్లు మ‌ళ్లీ తామే గెలుస్తామ‌ని పైకి డాంబికాలు పోతున్నా లోప‌ల మాత్రం వారిని కూడా ఓట‌మి భ‌యం వెంటాడుతోంది.


ఈ క్ర‌మంలోనే కొంద‌రు పార్టీ నేత‌లు త‌మ గెలుపు సందేహాలు బ‌య‌ట‌కు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికారం ఏ వైపున ఉంటే ఆ వైపున‌కు వంగిపోయే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ మంత్రివ‌ర్యులు అప్పుడే జ‌గ‌న్‌కు ట‌చ్‌లోకి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాత పార్టీల‌తో పాటు కొత్త‌గా వ‌చ్చిన పార్టీల‌ను కూడా రుచిచూసిన స‌ద‌రు మంత్రి వ‌ర్యులు ఎప్పుడూ ప‌ద‌వులే ధ్యేయంగా రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చారు. ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్ల‌వ‌చ్చ‌న్న వార్త‌లు వ‌చ్చాయి.


జ‌న‌సేన‌కు సీన్ లేద‌ని తేలిపోవ‌డం, ఇటు టీడీపీలో చివ‌రి వ‌ర‌కు సీటు విష‌యంలో అధిష్టానం టెన్ష‌న్ పెట్ట‌డంతో అస‌హ‌నంతోనే ఆయ‌న ఈ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. త‌న‌కున్న అల‌వాటు ప్ర‌కారం ఈ సారి కొత్త‌చోటే పోటీ చేశారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉండి, ఆ త‌ర్వాత బాబు కేబినెట్‌లో ప‌నిచేసి ఇప్పుడు మ‌ళ్లీ ప‌ద‌వి కోసం జ‌గ‌న్ వైపు చూపులు చూస్తున్న‌ట్టు టాక్‌. పార్టీ ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి ద్వారా స‌ద‌రు మంత్రి జ‌గ‌న్‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ గెలుపుపై న‌మ్మ‌కం లేకే ఆయ‌న పార్టీ మారుతున్నార‌ని తెలుస్తోంది.


ఆయ‌న‌కు కావాల్సింది ప‌ద‌వి. ప‌ద‌వి లేక‌పోతే ఆయ‌న ఉండ‌లేరు. ఇక ఆ జిల్లాలో త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు అయినా ఆయ‌న వ‌ర్గం ఎమ్మెల్యేలు ఉంటారు. వీరంద‌రిని క‌లుపుకుని వైసీపీలోకి జంప్ చేయ‌డ‌మే త‌రువాయి. మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ ఇస్తే చాలు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై ప్రాథ‌మికంగా చ‌ర్చ‌లు కూడా కంప్లీట్ అయ్యాయ‌ట‌. ఇంకా ఫ‌లితాలే రాలేదు. అప్పుడే టీడీపీ నుంచి మంత్రుల‌తో పాటు ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీలో ఖ‌ర్చీఫ్‌లు వేసేందుకు రెడీ అయిపోతున్నారు.


ఫలితాలు వ‌స్తే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిన‌ట్టే ఏపీలో టీడీపీ అతి త్వ‌ర‌లోనే క్లోజ్ అయిపోనుంది. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి కాలం చెల్లిపోతుండ‌డంతో ఇప్పుడు ఇక లోకేష్ నాయ‌క‌త్వంలో పార్టీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కాలు ఆ పార్టీ నేత‌ల‌కే లేవు. ఇప్ప‌టికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక యువ ఎంపీ అభ్యర్థి ఇప్పుడు విశాఖ నుంచి పోటీలో ఉన్న ఈ మాజీ మంత్రి.. ఇలా చూసుకుంటే పోతే చాలా మంది వైసీపీ గూట్లోకి రెడీ అయిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: