అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. తాజాగా జేసి చేసిన వ్యాఖ్యలతో ఇపుడిదే అనుమానం అందరిలోను మొదలైంది. పోలింగ్ జరిగిన తర్వాత తాడిపత్రిలో గెలుపు ఎవరిదో చాలామంది చెప్పలేకున్నారు. కానీ తాజాగా జేసి మాట్లాడుతూ రెడ్లలో 99.999 శాతం ఓట్లు వైసిపికే పడ్డాయని చెప్పారు. దాంతో తాడిపత్రిలో టిడిపి ఓటమిపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.

 

 జేసి చెప్పినా చెప్పకపోయినా రాయలసీమలో రెడ్లలో అత్యధికులు వైసిపి వైపు మొగ్గారన్నది స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి నేతల్లో చాలామంది వైసిపిలోకి మళ్ళారు. అలాగే ఓటర్లలో కూడా చాలామంది వైసిపికే మద్దతుగా నిలబడ్డారు. కానీ అనంతపురంలోని తాడిపత్రి లాంటి ఒకటి రెండు సీట్లలో మాత్రం టిడిపిదే ఆధిపత్యంగా కనబడుతోంది.

 

అలాంటిది తాజాగా జేసి వ్యాఖ్యలతో ఇక్కడ జేసి ప్రభాకర్ రెడ్డి ఓటమి ఖాయమే అని తేలిపోతోంది. నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. అందుకే ఏ సామాజికవర్గం ఎటున్నా రెడ్లు మాత్రం సాలిడ్ గా జేసి కుటుంబానికే మద్దతుగా నిలుస్తున్న కారణంగానే పార్టీలతో సంబంధాలు లేకుండా జేసి సోదరులు గెలుస్తున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోను జేసి సోదరులు తమ వారసులను రంగంలోకి దింపారు. అనంతరపుం పార్లమెంటు పరిధిలో జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసి పవన్ రెడ్డి గెలుపు కష్టమనే టాక్ నడుస్తోంది. అయితే తాడిపత్రిలో మాత్రం జేసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసి అస్మిత్ రెడ్డి గెలుపు ఖాయమనే అనుకుంటున్నారు. కానీ ఎంపి మాటలు విన్న తర్వాత తాడిపత్రిలో కూడా టిడిపి గెలుపు కష్టమనే భావన మొదలైంది.

 

ఎందుకంటే, వైసిపి తరపున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తక్కువోడేమీ కాదు. రెడ్లలో మంచి పట్టున్న నేత. పైగా ఐదేళ్ళల్లో జేసి సోదరుల ఆగడాలు భరించలేక చాలామంది రెడ్లు, ప్రధానంగా జేసి మద్దతుదారులు కూడా పెద్దారెడ్డి అండర్ లోకి వచ్చేశారు. కాబట్టి రెడ్డి ఓట్లు చెరిసగం పడుంటాయని అనుకున్నారు. కానీ ఎంపి మాట్లాడుతూ, రెడ్డి ఓట్లలో 99.999 శాతం వైసిపికే పడ్డాయని చెప్పటం ద్వారా తమ గెలుపు కష్టమనే చెప్పారు.  టిడిపి సంప్రదాయ ఓట్లు పడక, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెరిగిన సమయంలో రెడ్లు కూడా వైసిపికే మద్దతుగా నిలబడితే తాడిపత్రిలో టిడిపి ఓటమి ఖాయమేనా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: