నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఓ ఎంపీ గానే కాదు.. ఆయన ఎన్నో విషయాల్లో తనదైన ముద్ర వేశారు. 


ఆయన గొప్పదనం గురించి ఓ చిరు వ్యాసం ఇది. ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు ఎస్. పెద్ద యెరికల్ రెడ్డి. జూన్ 4, 1950లో కడపలో ఆయన జన్మించారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత ముంబైలోని బాబాఅటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా చేరారు. 

1977లో సైంటిఫిక్ ఆఫీసర్ హోదాలో పని చేస్తూ సొంత పరిశ్రమ పెట్టే ఉద్దేశంతో  బయటకు వచ్చేశారు. 1979లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ల సంస్థను స్థాపించారు. 1984 సంవత్సరం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ ఏడు నంది పైపుల పేరుతో PVC పైపుల తయారీ రంగంలోకి దిగారు. 

ఆ తర్వాత ఎస్పీవై రెడ్డి ఇంటిపేరు నంది అయ్యింది. అంతగా ఆ పైపుల పరిశ్రమ వర్థిల్లింది. తన ఆదాయంలో ఆయన చాలావరకూ సేవా కార్యక్రమాలకు కేటాయించేవారు. నంద్యాల ప్రాంతంలో పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 

పేదలకు కేవలం రెండు రూపాయలే అన్నం పెట్టేవారు. ఆ తర్వతా పప్పు- రొట్టె పెద్దఎత్తున పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలతో నంద్యాల ప్రాంతంలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయవచ్చన్న ఉద్దేశంతో.. బిజెపి తరఫున 1991 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. 

1999 అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల మరియు గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రెండింటికీ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. నంద్యాలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.  2000లో కాంగ్రెస్ లో చేరారు. పురపాలక ఛైర్మన్ గా రికార్డ్ మెజారిటీ సాధించారు. 

2004లో నంద్యాల నుండి MP అభ్యర్థిగా పోటీ చేసి లక్ష మెజారిటీ సాధించారు. 2009లో మరోసారి ఇదే నియోజకవర్గం నుండి గెలిచారు.  ఆతర్వాత వైసీపీలో చేరారు.. 2014 లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీలో చేరారు. 

తాజాగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. రాజకీయాల విషయం పక్కకు పెడితే.. ప్రజాసేవలో నిత్యం ముందుండేవారు ఎస్పీవై రెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: