ఏపీలో గత నెలలో ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనుండడంతో ఏపీలో ఎవ‌రు ? అధికారంలోకి వ‌స్తారు. ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌దానిపై స‌హ‌జంగానే అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు, ఓట‌ముల‌పై ఎవ్వ‌రూ అంచ‌నాల‌కు రాలేక న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉంటే ఎన్నిక‌ల‌కు ముందు కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్థులు ఉన్నా జ‌గ‌న్ ఏరికోరి ఎన్నో ఆశ‌ల‌తో కొంద‌రిని రంగంలోకి దించి మ‌రీ టిక్కెట్లు ఇచ్చారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌కాశం జిల్లాలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి.


ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందు రావి రామ‌నాథం బాబు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయ‌న వ‌ల్ల అక్క‌డ పార్టీ బ‌లోపేతం కాలేద‌ని గ్ర‌హించిన జిల్లా వైసీపీ నేత‌లు వైవి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇలా వీరంద‌రూ స్కెచ్ వేసి మ‌రీ చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును రంగంలోకి దించారు. వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌తో క‌లిసి వైసీపీలో చేరారు. ముందుగా కుమారుడే ప‌రుచూరులో వైసీపీ నుంచి పోటీ చేస్తాడ‌ని వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించారు.


చివ‌ర్లో కుమారుడు పౌర‌స‌త్వ విష‌యం తేల‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ చివ‌ర‌క‌కు వెంక‌టేశ్వ‌ర‌రావుకే సీటు ఇచ్చారు. ముందు నుంచి పోటీ విష‌యంలో అయిష్ట‌త‌తో ఉన్న ఆయ‌న ఎన్నిక‌ల సీటు ఎనౌన్స్ అయ్యాక వారం రోజుల‌కు గాని బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు టీడీపీ అభ్య‌ర్థి ఏలూరు సాంబ‌శివ‌రావు ఆరు నెల‌ల నుంచే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నారు. ఇటు ద‌గ్గుబాటి అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తూ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేక‌పోయారు. ఎప్పుడో జ‌మానా కాలంలో పాలిటిక్స్ చేసిన‌ట్టుగా ఊరుకు వెళ్ల‌డం... కేవ‌లం అక్క‌డ పార్టీ పెద్ద మ‌నుష్యుల‌ను క‌లిసి రావ‌డంతో స‌రిపెట్టేశారు. ఇక ఇక్క‌డ ప్ర‌చారం సంగ‌తి స‌రేస‌రి... చివ‌ర్లో డ‌బ్బులు కూడా స‌రిగా ఖ‌ర్చు చేయ‌లేద‌న్న ఫిర్యాదులు కూడా సొంత పార్టీ నేత‌ల నుంచే వ‌చ్చాయి.


అటు ప్ర‌చారంలో ఏలూరు ముందు నుంచి దూకుడుగానే వెళ్లారు. ఇటు భార్య పురందేశ్వ‌రి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేయ‌డం... ఇటు తండ్రి, కొడుకులు వైసీపీలో ఉండ‌డం... ద‌గ్గుపాటి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉండ‌డంతో ప‌రుచూరు ప్ర‌జ‌లు చాలా వ‌ర‌కు ద‌గ్గుపాటిని న‌మ్మ‌లేద‌ని తేలింది. ఇక పూర్తి అయిష్ట‌త‌తో ఉన్న ఆయ‌న ముందు నుంచే గెల‌వ‌న‌ప్పుడు డ‌బ్బులు ఖ‌ర్చుపెట్ట‌డం, తిర‌గ‌డం ఎందుకు దండ‌గ అన్న‌ట్టుగా ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఏదేమైనా జ‌గ‌న్ చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు, ఎన్టీఆర్ అల్లుడు పార్టీకి ప్ల‌స్ అవుతాడ‌న్న బ్రాండ్ చూసి సీటు ఇచ్చి రాంగ్ స్టెప్ వేశార‌ని... ఈ సీటు అన‌వ‌స‌రంగా వైసీపీ చేజారిన‌ట్టే అన్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: