ఒక పక్కేమో చంద్రబాబు మనదే విజయమని కార్యకర్తలకు చెబుతుంటారు. ఇంకొక పక్కేమో ఓటమి భయంతో మాట్లాడతుంటాడు. నిన్నటికి నిన్న కార్యకర్తలతో మాట్లాడారు. బాగానే వుంది. కానీ కౌంటింగ్ మధ్యలో లేచి వచ్చేయకండి. అలా చివరిదాకా వుండలేని వాళ్లు కౌంటింగ్ డ్యూటీలకు వెళ్లకండి అని చెప్పారు. కౌంటింగ్ డ్యూటీకి వెళ్లినవారు మధ్యలో ఎందుకు వచ్చేస్తారు? అప్పటివరకు అయిన అన్ని రౌండ్లలో వైకాపాకే మెజారిటీ భయంకరంగా వస్తుంటే అప్పుడు వచ్చేసే అవకాశం వుంది.


అంటే బాబు అలాంటి వ్యవహారం వుంటుందని అనుమానిస్తున్నారా?  వైకాపాతో సమానంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వస్తుంటే బయటకు ఎందుకు వచ్చేస్తారు? ఓ పక్క ప్రచారాలు నమ్మవద్దు, మెజారిటీ మనదే 130 సీట్లు పక్కా అంటారు. మరోపక్క ఇలా ఆయనే అనుమానపు మాటలు మాట్లాడుతున్నారు. మెజారిటీ పక్కా అన్న భరోసా వున్నపుడు రెండువారాలు ఆగితే తానే ముఖ్యమంత్రి కదా? మరి ఎందుకు చీఫ్ సెక్రటరీ, ఈసీల వ్యవహారం మీద నానాయాగీ చేస్తున్నారో అర్థంకాదు. ఏ ఒక్కచోటా, ఏ ఒక్క అభ్యర్థి మాట్లాడడంలేదు, జగన్ నోరెత్తడం లేదు.


పవన్ పల్లెత్తుమాట మాట్లాడడం లేదు. మరి బాబుగారు మాత్రం ఎందుకు ఇలా కిందామీదా అయిపోతున్నారో అన్నది అసలే అర్థంకాదు. ఇదంతా గెలుపు వస్తుందో రాదో అన్నభయమా? ప్రజల నాడి అందక వస్తున్న సమస్యనా? లేకపోతే చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కూడా బెట్టింగ్ జనాలు తెలుగుదేశమే గెలుస్తుంది అని అంటున్నారని కార్యకర్తలకు చెప్పడం ఏమిటి? చోద్యం కాకపోతే.

మరింత సమాచారం తెలుసుకోండి: