ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా చోట్ల ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది. ఈ ముక్కోణ‌పు పోటీ జ‌రిగిన చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఇక జ‌న‌సేన ఈ ఎన్నిక‌ల్లో నామ‌మాత్ర ప్ర‌భావ‌మే చూపినా ఆ పార్టీ ప‌దుల సంఖ్య‌లో నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం గ‌ట్టి పోటీ ఇచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సామాజిక‌వ‌ర్గ‌మైన కాపుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానులు ఎక్కువుగా ఉన్న చోట ఆ పార్టీ ప్ర‌భావం బాగా క‌న‌ప‌డింది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరు, వైజాగ్‌, ఇక సీమ‌లోని ఒక‌టి, ఆరా జిల్లాల్లో ఆ పార్టీ భారీగా ఓట్లు చీల్చింది.


గ‌త ఎన్నిక‌ల్లో ఉభ‌య‌గోదావ‌రి, వైజాగ్‌, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో వ‌చ్చిన సీట్ల‌తోనే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ చేయ‌డంతో పాటు అటు బీజేపీతో పొత్తు, మోడీ వేవ్‌, ప‌వ‌న్‌కు అప్ప‌ట్లో ఉన్న క్రేజ్ అవ‌న్నీ చంద్ర‌బాబును అధికారంలోకి తీసుకువ‌చ్చాయి.ఈ ఎన్నిక‌ల్లో అటు బీజేపీతో పాటు ఇటు ప‌వ‌న్ ఇద్ద‌రూ సొంతంగా పోటీ చేయ‌డంతో ఆ ప్ర‌భావం టీడీపీపై గ‌ట్టిగా ప‌డింది. అలాగే న‌ర‌సాపురం, వైజాగ్‌, అమ‌లాపురం లాంటి లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన ఎఫెక్ట్ టీడీపీకి గ‌ట్టిగానే ఉంది. 


న‌ర‌సాపురం నుంచి ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు, వైజాగ్ నుంచి ఎంపీలుగా జ‌న‌సేన త‌ర‌పున రంగంలో ఉండ‌డంతో వీరు టీడీపీ ఓటు బ్యాంకుకు బాగా చిల్లు పెట్టారు. ఇక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే ఎక్కడైతే జనసేన బలంగా పోటీ ఇచ్చిందో అక్కడ తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితం అయిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయని రాజ‌కీయ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. టీడీపీ మూడో ప్లేస్‌కు ప‌డిపోయే నియోజ‌క‌వ‌ర్గాల్లో భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం, గాజువాక‌, అవ‌నిగ‌డ్డ‌, పెడ‌న‌తో పాటు గుంటూరు జిల్లాలో జ‌నసేన బ‌లంగా ప్ర‌భావం చూపిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి పోటీ చేసిన క‌ళ్యాణ‌దుర్గం పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి మూడో ప్లేస్ త‌ప్ప‌దంటున్నారు. ఆ రెండు చోట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఆ రెండు చోట్లా టీడీపీ కూడా ప‌వ‌న్‌కు స‌హ‌క‌రించింద‌న్న టాక్ ఉంది. ఇక కళ్యాణ‌దుర్గంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తెలుగుదేశం పార్టీ సహకరించిందనే మాట వినిపిస్తోంది. గ‌తంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉభ‌గోదావ‌రి జిల్లాల్లో కాపుల ఓట్లు ఎక్కువ ఉన్న ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ మూడో ప్లేస్‌కు ప‌డిపోయింది. ఇప్పుడు కూడా జ‌న‌సేన ఎఫెక్ట్‌తో టీడీపీ మూడో ప్లేస్‌కు పడిపోయే నియోజ‌క‌వ‌ర్గాలు ఎక్కువే ఉన్నాయి. మ‌రి టీడీపీ ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో థ‌ర్డ్ ప్లేస్‌తో స‌రిపెట్టుకుంటుందో ? ఈ నెల 23న తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: