రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. అయితే, ఫ‌లితంపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఎన్నిక‌ల‌కు ఫ‌లితాల వెల్ల‌డికి దాదాపు 40 రోజుల వ్య‌వ‌ధి ఉండ‌డంతో ఉత్కంఠ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే, ఎన్నిక‌ల స‌ర‌ళి, పోలింగ్ జ‌రిగిన తీరు, ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన `మార్పు` వంటివాటిని ప‌రిశీలించిన మేధావులు మాత్రం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. రాష్ట్రంలో అధికారం మార్పు జ‌రుగుతుంద‌ని, వైఎస్ త‌న‌యుడిగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువ అయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించార‌ని.. ఒక్క ఛాన్స్ ఇచ్చార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామంతో వైసీపీ కూడా ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే త‌మ‌కు 130 స్థానాల్లో విజ‌యం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించింది. 


ఇక‌, ఆ వెంట‌నే రాష్ట్రంలో మార్పు ఖాయ‌మ‌ని అనేక స‌ర్వేలు కూడా వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర భుత్వం వ‌స్తుంద‌నే అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఇక‌, జ‌గ‌న్ మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తే.. ఎవ‌రెవ‌రికి ఏయే మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే క‌థ‌నాలు కూడా విస్తృతంగా వ‌చ్చాయి. ఇప్పుడు ఈ క్ర‌మంలోనే తాజాగా రాజ‌కీయ మేధావి, సీని య‌ర్ అడ్వ‌కేట్ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ను కూడా జ‌గ‌న్ త‌న కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా వైసీపీలోని సీనియ‌ర్ల నుంచే ఈ వ్యాఖ్య‌లు వినిపించ‌డంతో నిజ‌మేన‌ని అనుకుంటున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలం లో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన కేవీపీ వంటి వారిలో ఒక‌రుగా ఉండ‌వ‌ల్లి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. 


పైగా నిజాయితీ ప‌రుడిగా, ఎలాంటి మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా ఉండ‌వ‌ల్లి పేరు తెచ్చుకున్నారు. రెండు సార్లు రాజ‌మండ్రి నుంచి ఎంపీగా గెలిచినా ఒక్క అక్ర‌మ వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న‌పై ఎలాంటి మచ్చ‌లు, మ‌ర‌క‌లు అంట‌క‌పోవ‌డం గ‌మ‌నా ర్హం. పైగా ఆయ‌న రాజ‌కీయంగానే కాకుండా ఆర్థికంగా, రాష్ట్ర ప‌రిస్థితుల‌పై పూర్తిస్థాయిలో అనుభ‌వ‌మున్న మేదావిగా కూడా గుర్తింపు పొందారు. మేధావులు సైతం ఉండ‌వ‌ల్లి సూచ‌న‌ల‌ను, స‌ల‌హాల‌ను పాటించిన సంద‌ర్భాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా మెలిగిన ఉండ‌వ‌ల్లి రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌ట‌స్థంగా ఉండిపోయారు. 


త‌ర‌చుగా రాష్ట్ర రాజ‌కీయాలు, రాష్ట్ర ప‌రిస్థితి, ఆర్థిక స‌మ‌స్య‌ల‌పై మీడియా మీటింగులు పెట్టి.. విష‌యాల‌ను పూస‌గుచ్చి న‌ట్టు వివ‌రిస్తూ.. సామాన్యుల‌కు మేధావుల‌కు కూడా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇలాంటి సంద‌ర్భాల్లోనే ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే, ఆయ‌న మాత్రం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగానే ఉండిపోయారు. రేపు ఒక‌వేళ జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరితే.. మంత్రివ‌ర్గంలోకి అరుణ్ కుమార్‌ను ఆహ్వానించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. కీల‌క‌మైన ఆర్థిక‌, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ‌ల‌ను ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా రాష్ట్రంలో సంచ‌ల‌నానికి జ‌గ‌న్ తెర‌దీస్తార‌ని అంటున్నారు. 


ముఖ్యంగా ఉండ‌వ‌ల్లి వంటి మేధావులు ఆర్థిక‌, శాస‌న స‌భ వ్య‌వ‌హారాలు చూసుకుంటే.. చంద్ర‌బాబు వంటి అప‌ర‌చాణిక్యుడికి చెక్ పెట్టిన‌ట్టు కూడా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఎలాగూ.. అరుణ్ కుమార్‌కు చంద్ర‌బాబుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి న‌డిచిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోర‌ని ప‌రిశీల‌కులు కూడా భావిస్తున్నారు. ఉండ‌వ‌ల్లిని  ఎమ్మెల్సీని చేసి, త‌న కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. రాష్ట్రంలోని అంద‌రూ దీనిని స్వాగ‌తిస్తార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: