అవును మరికొన్ని గంటల్లో చంద్రబాబునాయుడుకున్న ప్రిస్టేంజేంటో తేలిపోతుంది. క్యాబినెట్ సమావేశమంటూ కొత్త కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా  ప్రిస్టేజికి వెళ్ళి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సరే 10వ తేదీన క్యాబినెట్ జరపాలని నిర్ణయించినా సాధ్యంకాక 14వ తేదీకి మార్చుకున్నారులేండి.

 

క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని చంద్రబాబు అనుకుంటున్న అంశాలు కూడా ఏమంత అత్యవసరమైనవి కావు. ఫణి తుపాను, కరువు, మంచినీటి ఎద్దడి, ఉపాథిహామీ పథకాలపై చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం పెట్టమని చంద్రబాబు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను ఆదేశించారు. చంద్రబాబు సూచించిన అంశాలపై ఎల్వీ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమవుతోంది.

 

నిజానికి చంద్రబాబు సూచించిన అంశాలేవీ అంత అత్యవసరం కావు. ఎందుకంటే, ఫణి తుపానుపై ఎల్వీ ప్రతీరోజు సమీక్షించారు. ముందు జాగ్రత్తగా అత్యవసర చర్యలు తీసుకున్నారు. తుపాను ప్రభావం నుండి ఉత్తరాంధ్రప్రాంతం తొందరగానే కోలుకునేందుకు తీసుకోవాల్సిన అన్నీ చర్యలను ఎల్వీ తీసుకున్నారు. కాబట్టే ఎక్కడా గొడవలు లేకుండా, అనవసర హడావుడి లేకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి.

 

ఇక కరువు, మంచినీటి ఎద్దడి పై సిఎస్ ప్రతీరోజు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు సమీక్షించినా సిఎస్ సమీక్షించినా జిల్లా కలెక్టర్లకే సూచనలు, సలహాలు ఇవ్వాలి. సిఎస్ ఇపుడు చేస్తున్నదదే. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం పెట్టి చర్చించేదేమీ లేదు.

 

చివరగా ఉపాధి హామీ పథకం అమలట.  ఈ విషయంలో చర్చించాల్సిన అత్యవసరం ఏముందో చంద్రబాబుకే తెలియాలి. ఐదేళ్ళ నుండి క్యాబినెట్లో చర్చిస్తునే ఉన్నారు, సూచనలు చేస్తునేఉన్నారు. కాకపోతే దాదాపు రూ. 2 వేల కోట్ల బిల్లులను సిఎస్ పెండింగ్ లో ఉండిపోయాయట. పనులు చేయకుండానే టిడిపి నేతలు చాలామంది బిల్లులు తీసేసుకుంటున్నట్లు బిజెపి నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు.

 

రేపు ప్రభుత్వం మారితే బిల్లులు రాకపోగా  వ్యవహారమంతా  బయటకు వస్తుందన్న ఆందోళనలో చంద్రబాబు ఉన్నారేమో. ఆ బిల్లుల కోసమే క్యాబినెట్ అత్యవసర సమావేశం అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా స్క్రీనింగ్ కమిటీ చూసి తర్వాత ఎలక్షన్ కమీషన్ కు పంపుతుంది. ఒకవేళ గనుక స్క్రీనింగ్ కమిటీనే తిరస్కరించినా లేకపోతే ఎలక్షన్ కమీషన్ క్యాబినెట్ అవసరం లేదని తేల్చేసినా చంద్రబాబు పరువు సాంతం కృష్ణానదిలో కలిసిపోవటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: