తెలంగాణాలో కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీని నడిపించే సరైన నాయకుడే లేకుండా పోయాడు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలో పాలుపోక టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. దీంతో అసలు తెలంగాణాలో శాసనసభ పక్షం ఉనికే ప్రశ్నార్ధకంలా మారిపోయింది.  


దీంతో అసలు ఎన్నికలను ఎదుర్కొవడానికే భయపడే స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఇదే అదునుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తీసుకొచ్చి టీఆర్ఎస్, కాంగ్రెస్ ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఈ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్న టీ కాంగ్రెస్ కు కేసీఆర్ మరో పంచ్ ఇచ్చారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు రెడీ అయ్యారు. మండల స్థాయిలోనే పోటీ చేసేందుకు నాయకులు లేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బే. 


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం, తాజా పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ హవా స్పష్టంగా కనిపించడంతో పోటీకి నిలబడటం ఎందుకు? ఓడిపోవడం ఎందుకు? అనే ధోరణిలోకి కాంగ్రెస్ నాయకులు దిగజారిపోయారు. ఎలానూ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఆ మాత్రం దానికి నిలబడటం ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? అని చాలా మంది నాయకులు పోటీకి వెనకాడుతున్నారు. 


మొత్తం 3 ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ ను ఇచ్చింది. వరంగల్ నుంచి గెలిచిన కొండా మురళి కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేయగా, కొడంగల్ లో గెలిచిన వేం నరేందర్‌ రెడ్డి కూడా ఎమ్మెల్సీ కి రాజీనామా చేసారు. అలాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసారు. అయితే ఈ మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కు నాయకులే లేకపోవడం ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ దీన స్థితిని తెలియజేస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: