త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రు! అన్న చందంగా మారింది టీవీ 9 ర‌వి ప్ర‌కాశ్ సంగ‌తి! ఫ‌క్తు వ్యాపార దృక్ప‌థంతో టీవీని పెట్టిన ఆయ‌న ఈ ఛానెల్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా కూడా వెల‌గ‌బెట్టాడు. రేటింగ్ పెంచుకునేందుకు తొక్క‌ని దారి అంటూ ఏదీ లేదు. ఇక‌, స‌మాజానికి టీవీ 9 వేదిక‌గా ఆయ‌న చెప్ప‌ని నీతులు లేవు. ముఖ్యంగా లంచం ఇచ్చేవాడు కూడా గాడిదే! అంటూ కొత్త సూత్రం వ‌ల్లించారు. ఇక‌, క‌ట్నం పుచ్చుకునేవాడిని గాడిద కిందే జ‌మ‌క‌ట్టాడు. ఇలా స‌మాజం లో మార్పు రావాల‌ని అనుకోవ‌డం మంచిదే! అయితే, చెప్పేవారు కూడా నీతులు పాటించాల‌ని అంటారు క‌దా మ‌న పెద్ద‌లు. కానీ ఈ ఒక్క‌టీ మాత్రం త‌న‌ను అడ‌గ‌ద్ద‌ని ముక్కుమీద గుద్ది మ‌రీ చెప్పేస్తాడు మ‌న ర‌విప్ర‌కాశ్!


త‌న దాకా వ‌స్తేనే కానీ విష‌యం బోధ‌ప‌డ‌ద‌న్న‌ట్టుగా నీతులు చెప్పిన ర‌వి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి.. క‌ట‌క‌టాలు లెక్కించేందుకు రెడీ అయిపోయాడు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు ఇప్పుడు ఆ నీతులు ఏవీ కూడా కాపాడ‌లేక పోతున్నాయి. ఇటీవ‌ల యాజ‌మాన్యం మారిన నేప‌థ్యంలో ఏకంగా ఆయనను సీఈవో బాధ్యతల నుంచి తప్పించారు. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 


అంతేకాదు, తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా  టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే.  టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్‌ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. 


ఏబీసీఎల్‌లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది.  దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది.  దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. 


ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు.  ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు.


దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు  ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టికి ర‌విప్ర‌కాశ్‌ను బోనెక్కించింది. ఏదేమైనా.. నీతులు చెప్పేముందు మ‌నం ఎంత నీతిగా ఉంటున్నామ‌నే విష‌యాన్ని ఇప్ప‌టికైనా గుర్తించి ఉంటే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: