టీవీ9 రవిప్రకాశ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన స్వయంగా తన ఛానల్లో లైవ్‌లోకి వచ్చారు. తనపై తప్పుడు వార్తలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. తనను అరెస్టు చేయడంలేదని.. చేయబోరని ధీమాగా చెప్పారు. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆయన తన వాదన వినిపించారు.


ఇప్పుడు ఈ వాదనకు కౌంటర్‌ రెడీ అయ్యింది. టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ వాదనను సమాధానం  తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ వాదన ఓ సారి చూడండి.. 

రవిప్రకాశ్ ఆరోపణ: తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు.

- చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్‌కు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో 90 శాతానికి పైగా వాటా ఉందనడం తప్పుడు వార్తా?
- చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్‌ నుంచి 90 శాతానికి పైగా వాటాలను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 2018లో కొనుగోలు చేసిందని చెప్పడం తప్పుడు వార్తా?
- మెజార్టీ వాటా ఉన్నప్పటికీ అలంద మీడియా డైరెక్టర్లను.. ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో చేర్చకుండా రవిప్రకాశ్ అడ్డుపడడం తప్పుడు వార్తా..? 
-  కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారని సదరు ఉద్యోగి ఫిర్యాదు చేయడం వాస్తవం కాదా..? ఆ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేయడం నిజం కాదా..? ఇందులో ఏది తప్పుడు వార్త..? 

రవిప్రకాశ్ ఆరోపణ: NCLT కేసు వివాదాన్ని తీసుకుని కొంతమంది ఏవో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు.

NCLT కేసును అడ్డుగా పెట్టుకుని టీవీ9లో చక్రం తిప్పాలని ప్రయత్నించింది ఎవరు..? రవిప్రకాశ్ కాదా..? 
NCLT మధ్యంతర ఉత్తర్వులు రావడానికి ముందే ఏబీసీఎల్ కొనుగోలు ప్రక్రియ పూర్తైనా, కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి బోర్డ్ సమావేశాల్లోనే తీర్మానం చేసి సంతకం కూడా చేసి కేంద్ర సమాచార శాఖకు పంపించిన రవిప్రకాశ్‌, బోర్డులో మాత్రం కొత్త డైరెక్టర్ల చేరికను ఎందుకు అడ్డుకుంటున్నారు?
అసలు NCLT వద్దకు సినీనటుడు శివాజీని పంపించి ఫిర్యాదు చేయించింది ఎవరు..? వ్యక్తిగతంగా రవిప్రకాశ్‌ మోసం చేస్తే, శివాజీ ABCL మీద ఎందుకు ఫిర్యాదు చేశారు..? 


రవిప్రకాశ్ : క్రెడిబిలిటీ అనే అంశం గురించి పనిచేసి ఉంటే, ఎవరో ఒత్తిడి... ఎవరో ఇచ్చిన్న ధనాన్ని ఉపయోగించి, మీరు వార్తల తయారీకి దాన్ని వాడకుండా ఉంటే మీ క్రెడిబిలిటీ పెరిగి ఉండేది. పారదర్శకత ఉండి ఉండేది. మీ పట్ల కూడా ప్రజాభిమానం పెరిగి ఉండేది.

- మీపై నమ్మకంతో చానల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన కంపెనీకి మీరు చేసింది ఏమిటి? కంపెనీని విక్రయించాలన్న ప్రయత్నాలను అడ్డుకోవడమే విశ్వసనీయతా..? 90 శాతానికి పైగా షేర్లు ఉన్న అలంద మీడియాకు నిర్వహణ బాధ్యతలు అప్పగించక పోవడాన్నే క్రెడిబిలిటీ అనుకోవాలా..? 
- చానల్‌ లావాదేవీలను కొత్త యాజమాన్యానికి తెలియకుండా కప్పిపుచ్చడమే పారదర్శకత పాటించడం అనుకోవాలా..?
- ఇక NCLT లో మీ మిత్రుడు శివాజీ చేసిన ఫిర్యాదే వాస్తవమనుకుంటే, డబ్బులు తీసుకుని అతడిని మోసం చేయడం,  మీ వాటాలోని షేర్లను బదలాయించకపోవడమే మీ క్రెడిబిలిటీని నిరూపించుకోవడం అంటారా రవిప్రకాశ్..

రవిప్రకాశ్ ఆరోపణ: రవిప్రకాశ్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. అరెస్ట్ చేయబోవడం లేదు. కొంతమంది కొన్ని తప్పుడు ఆరోపణలు పెట్టడానికి ప్రయత్నించారు.

- రవిప్రకాశ్ అరెస్ట్ చేశారని ఎవరూ చెప్పలేదు. పోలీసులు రవిప్రకాశ్ కోసం గాలిస్తున్నారని మాత్రమే చెప్పారు. మీ ఇంటికి పోలీసులు అంటించిన నోటీసునే టీవీ చానళ్లు అన్నీ చూపించాయి. 

రవిప్రకాశ్ ఆరోపణ: నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. 

- అవును, నిజమే. చానల్‌లో అతి తక్కువ వాటా ఉన్నా, చానల్ పూర్తిగా తనదేనన్న రీతిలో అబద్దపు ప్రచారం చేసుకున్నది రవిప్రకాశ్‌ కాదా..? దాన్నే నిజంగా అందరితో నమ్మించింది రవిప్రకాశ్ కాదా..?



మరింత సమాచారం తెలుసుకోండి: