ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఉత్కంఠ మాత్రం కొన‌సాగుతోంది. ముఖ్యంగా రాజ‌కీయ నేత‌ల వార‌సులు, బంధువులు ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌డంతో నాయ‌కుల మ‌ధ్య పోరు ఉత్కంఠగా మారింది. దీంతో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక‌, తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట. కాపు సామాజిక వ‌ర్గానికి ఎంతో బలం ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ అయినా ఇక్క‌డ నుంచి కాపు వ‌ర్గానికే అవ‌కాశం ఇస్తుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ఎన్నిక‌ల‌పై జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి కాపు వ‌ర్గానికే ప్రాధాన్యం ఇచ్చారు. 


2014 ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ విజ‌యం సాధించారు. అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయారు. ఇక‌, మొద‌ట్లో టీడీపీలోనే కొన‌సాగిన జ్యోతుల నెహ్రూ 1994 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. అయితే, 2004లో ఓట‌మితో ఆయ‌న 2009 నాటికి ప్ర‌జారాజ్యంలో చేరారు. అక్క‌డ కూడా ప‌రాజ‌యం రావ‌డంతో 2014 ఎన్నిక‌ల నాటికి వైసీపీలోకి చేరి జ‌గ‌న్‌కు జైకొట్టారు. ఆ టికెట్‌పై విజ‌యం సాధించారు. దీంతో 2014 నాటికే చంద్ర‌బాబు జ్యోతుల నెహ్రూ లేక‌పోవ‌డంతో ఆయ‌న బంధువు, అన్న కుమారుడు జ్యోతుల చంటిబాబును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. 


2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి చంటిబాబు, వైసీపీ నుంచి జ్యోతుల పోటీ చేశారు. వ‌రుస‌కు బాబాయ్‌-అబ్బాయ్ అయినా.. ఎన్నిక‌ల్లో మాత్రం హోరా హోరీ పోరాడారు. ఇక, తాజా ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌రికి నాయ‌కులు రివ‌ర్స్ అయ్యారు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన జ్యోతుల నెహ్రూ.. ఇప్పుడు టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు., ఇక‌, టీడీపీ టికెట్‌పై గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన చంటిబాబు ఇప్పుడు వైసీపీ టికెట్‌పై పోటీ చేశారు. దీంతో హోరా హోరీ పోరు సాగింది. ఇక‌, ఇక్క‌డ నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున సూర్య చంద‌ర్ రావు పోటీకి దిగారు. త్రిముఖ పోటీ ఉంటుంద‌ని అనుకున్నా కూడా.. ప్ర‌ధాన పోరు మాత్రం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న విధంగానే సాగింది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: