తాజాగా జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోరు ఉద్రుతం గా సాగిన నేప‌థ్యంలో అదికారంలోకి ఎవ‌రు వ‌స్తారు? ఎవ‌రు గెలుస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా టీడీపీలో గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇచ్చిన నేప‌థ్యంలో, రాజ‌కీయంగా వారంతా సీనియ‌ర్‌లే కావ‌డంతో ఎన్నిక‌ల ర‌ణరంగం పూర్తి ఆస‌క్తిగా ప‌రిణ‌మించింది. ఈ క్ర‌మంలోనే కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అవ‌నిగ‌డ్డ‌లోనూ హోరా హోరీ పోరు సాగింది. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. 

ఇక‌, వైసీపీ నుంచి సింహాద్రి ర‌మేష్ ఇక్క‌డ పోటీ చేశారు. అయితే, ఈయ‌న 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి ఓడారు. అయినా ప‌దేళ్ల‌కు పైగా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తోనే మ‌మేక‌మై అంద‌రికి అందుబాటులో ఉంటున్నారు. ఈ ద‌ఫా మాత్రం ఎట్టిప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌నే క‌సితో సింహాద్రి ప్ర‌య‌త్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా కంఠంనేని ర‌వి శంక‌ర్ పోటీకి దిగారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ టిక్కెట్ కోసం విశ్వ‌ప్ర‌య్న‌తాలు చేస్తోన్న ర‌విశంక‌ర్ ఈ సారి స్వ‌తంత్య్రుడిగా పోటీ చేసి పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మండ‌లాల్లో ఆయ‌న ప్ర‌భావం స్వ‌ల్పంగా ఉన్నా అది టీడీపీకే మైన‌స్ అవుతుంది.  అదే విధంగా జ‌న‌సేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు బ‌రిలో నిలిచారు. ఇక్క‌డ  మండ‌లికి ఉన్న సంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఇప్పుడు కూడా ఆయ‌న‌కే ఉంద‌ని అంటున్నారు.

 అయితే, వైసీపీ నుంచి పోటీ చేసిన సింహాద్రి ర‌మేష్ ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అయితే, ఈయ‌న‌కు జ‌న‌సేన నుంచి ప్ర‌తికూల‌త ఎదురవుతోంద‌ని అంటున్నారు. కాపు ఓటు బ్యాంకు పూర్తిగా సింహాద్రికి ప‌డుతుంద‌ని వైసీపీ భావించింది అయితే, జ‌న‌సేన అభ్య‌ర్థి పూర్తిగా ఈ ఓట్ల‌ను చీల్చ‌డంతో ప‌రిస్థితి రివ‌ర్స్ అయింద‌ని, వైసీపీ ఇబ్బందిలో ప‌డింద‌ని అంటున్నారు. ఈ ముగ్గురు అభ్య‌ర్థులు కాపు సామాజిక‌వ‌ర్గం వారే. ఇక‌,టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మండ‌లి విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకును కంఠంనేని ర‌వి శంక‌ర్ చీల్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. టీడీపీ టికెట్‌ను ఆశించి రెండు సార్లు భంగ ప‌డిన కంఠంనేని ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో మండ‌లికి కూడా ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ సారి మండ‌లి గెలుపు అంత ఈజీకాద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: