ఏపీ సీఎంగా చంద్ర‌బాబు దేశంలోనే గుర్తింపు పొందారు. తానే సైబ‌రాబాద్‌ను నిర్మించాన‌ని, తాను లేక పోతే.. ఏపీలో ఐటీ లేద‌ని, ఫైళ్లు ప‌ట్టుకుని తాను అమెరికాలో చెప్పుల‌రిగేలా తిరిగి అనేక కంపెనీలను హైద‌రాబాద్‌కు తెచ్చాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో జాతీయ స్థాయిలో మ‌రింత గుర్తింపు కోసం త‌హ‌త‌హ లాడుతున్నారు. వాస్త‌వానికి 1999లోనే తాను నిర్ణ‌యం తీసుకుని వాజ్‌పేయితో స్నేహం చేశాన‌ని, అదేవిధంగా దేవెగౌడ‌ను సైతం ప్ర‌ధానిని చేశాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు..త‌రుచుగా ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పేందుకురెడీ అవుతున్నారు. 

ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తాను జాతీయ స్థాయిలో పోరాడుతున్నాన‌ని అంటున్న చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా ప‌లు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌గ‌డుతున్నారు. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల‌ని అప్పుడే రాష్ట్రాల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, బెంగాల్, మ‌హారాష్ట్ర‌ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చేతులు క‌లిపి బాబు ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు ఉవ్విళ్లూరుతున్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌తోనూ ఆయ‌న చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక‌, బాబు వ్యూహంలో ఇది ఒక్క‌టే కాకుండా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను జాతీయ రాజ‌కీయాల్లో దూరం చేయాల‌ని కూడా ఆయ‌న భావిస్తున్నారు. 

అయితే, ఇదే స‌మ‌యంలో తాను మాత్రం త‌క్కువా అన్న‌ట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ, కాంగ్రెస్‌యేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌న కూడా ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులోని విప‌క్షం, బాబు మిత్రుడు స్టాలిన్‌తోనూ కేసీఆర్ తాజాగా భేటీ అయ్యారు. అదేవిధంగా రెండు రోజుల కింద‌ట క‌ర్ణాట‌క సీఎం, బాబుకు ఆప్తుడు కుమార స్వామితోనూ కేసీఆర్ ఫోన్‌లోనే చ‌ర్చలు జ‌రిపారు. మ‌రోపక్క‌,  జ‌గ‌న్ త‌న‌వెంటే ఉన్నాడ‌ని కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే, జ‌గ‌న్‌ను జాతీయ రాజ‌కీయాల నుంచి దూరం చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు వ్యూహం బెడిసి కొడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కొన్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు 18 నుంచి 20 మంది ఎంపీలు క‌నుక వ‌స్తే.. అప్పుడు ఆయ‌న‌తోనూ తాము క‌లిసి ముందుకు వెళ్లాల‌ని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా సిద్ధంగానే ఉన్నాయి.  జ‌గ‌న్ అవినీతి ప‌రుడంటూ బాబు ఎంత చెప్పినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం ఏదో ఒక రూపంలో జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర చేసుకోవాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాఇ. జ‌గ‌న్ ను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా దువ్వుతున్నాయి. మ‌రోప‌క్క‌, జ‌గ‌న్‌పై జాతీయ స్థాయిలో బాబు దుష్ప్ర‌చారం బూమ‌రాంగ్ అవుతోంది. ప్రాంతీయ పార్టీలు అస‌లు బాబునే న‌మ్మ‌డం లేదా? అనే సందేహాల‌కు అవ‌కాశం ఇస్తోంది. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌క పోవ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు మాట‌లు మార్చ‌డం వంటివాటిని ప్రాంతీయ పార్టీల నేత‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా పార్టీలు జ‌గ‌న్ వైపు చూస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: