తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు త‌న వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర‌లో మ‌రో విజ‌యానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ‌లో జ‌రిగిన 17 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులుని విజ‌యం సాధించ‌డం ఖాయం అయ్యింది. అయితే ఆ పార్టీకి 17లో ఒక‌టి, అరా మాత్ర‌మే త‌గ్గ‌నున్నాయి. ఎన్ని సీట్లు త‌గ్గుతాయి అనేదానికోస‌మే అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో మ‌రో విజ‌యాన్ని కేసీఆర్ త‌న ఖాతాలో వేసుకోనున్నారు. తాజాగా తెలంగాణ‌లో జ‌రిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స్థానానికి సంబంధించి త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ఈ అభ్య‌ర్థుల జాబితాలో కేసీఆర్ కంటే కేటీఆర్ ముద్రే స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. కేటీఆర్ ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లోనూ త‌న వ‌ర్గం బ‌లంగా ఉండేలా చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేసుకుంటూ పోతున్నారు. తాజా జాబితాలో వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్య‌ర్థులుగా రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ సులువుగా గెలిచే బ‌లం ఉంది. 

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్య‌ర్థుల ఎంపిక‌లో మాత్రం పార్టీనే న‌మ్ముకుని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉండ‌డంతో పాటు కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా ఉన్న ఓ నేత‌కు షాక్ త‌ప్ప‌లేదు. ఆయ‌న స్థానంలో కేటీఆర్‌కు స‌న్నిహితుడు అయిన, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న‌ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్‌ను న‌మ్ముకొని ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సైతం ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటుపై హామీ ఇచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యాక ఆయ‌న పేరు కూడా ఎమ్మెల్సీ సీటుకు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జరిగింది.

చివ‌ర‌కు అభ్య‌ర్థుల ఎంపిక‌కు వ‌చ్చేస‌రికి ర‌వీంద‌ర్‌రావుకు నిరాశే ఎదురైంది. ఆయ‌న‌కు బ‌దులుగా కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న పోచంప‌ల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖ‌రారు చేశారు. త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు కేసీఆర్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన వ్య‌క్తి. పార్టీకి ఎంతో క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేశారు. అలాంటి వ్య‌క్తికి మొండిచేయి చూప‌డం ఇప్పుడు పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండ‌డం, ఎన్నోసార్లు త్యాగం చేసి ఉండ‌డంతో ఈ సారి సీటుపై ఆశ‌లు పెట్టుకున్న ఆయ‌నకు మ‌ళ్లీ మొండిచేయి త‌ప్ప‌లేదు. ఏదేమైనా తెలంగాణ‌లో అన్ని జిల్లాల్లోనూ కేటీఆర్ టీం ఉండేలా ఇప్ప‌టికే కేసీఆర్ మార్గ‌నిర్దేశ‌క‌త్వంలో వ‌ర్క్ జ‌రుగుతోందన్న‌దానికి తాజా సంఘ‌ట‌న కూడా నిద‌ర్శ‌నం.


మరింత సమాచారం తెలుసుకోండి: