టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది మరొక‌టి అన్న‌ట్లుగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నారు. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలక భూమిక పోషించేలా చూసేందుకు ఆయ‌న అడుగులు వేస్తుండ‌గా...వాస్త‌వంగా ప‌రిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా సాగుతున్నాయి.  సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చెన్నై అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసంలో దాదాపు గంటపాటు ఇరువురి భేటీ కొనసాగింది. ఈ సంద‌ర్భంగా స్టాలిన్ కేసీఆర్‌కు షాకిచ్చిన‌ట్లు స‌మాచారం.


స్టాలిన్ కేసీఆర్ ఇరువురి భేటీలో ప్రధానంగా ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం. కేంద్రంలో ఏ జాతీయపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని, ప్రాంతీయ పార్టీల ఎంపీల సంఖ్య అత్యంత కీలకంగా మారుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రజాప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రాంతీయ నేతలంతా ఐక్యంగా ఉందామని స్టాలిన్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లుగా సమాచారం. దేశంలోని పలు ప్రాంతీయపార్టీల నేతలతో చర్చిస్తున్నానని, వారంతా సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్కరించారు. తాము కాంగ్రెస్‌ వైపే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
 
దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాలు ఎలా ఉంటాయనే అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల బలాబలాలు, వాటి మిత్రపక్షాలకు లభించే సీట్లు, తటస్థంగా ఉన్న పార్టీల అభిమతం, తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ఆ రెండు పార్టీల కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవనీ, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని కేసీఆర్‌.. స్టాలిన్‌కు వివరించారు. ఈ అవకాశాన్ని వినియో గించుకుని ప్రాంతీయ పార్టీల సంఘటిత శక్తిని ప్రదర్శిస్తే రాష్ట్రాలకు వంద శాతం న్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాఖ్య కూటమిని బలమైన శక్తిగా మార్చేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిద్దామంటూ సూచించారు. అయితే, దీనికి స్టాలిన్ నో చెప్పిన‌ట్లు స‌మాచారం.  భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియాతో ఏమీ మాట్లాడలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: