జ‌ర్న‌లిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి ఆ త‌ర్వాత రాజ‌కీయ అరంగేట్రం చేసిన కాల్వ శ్రీనివాసులు టీడీపీ త‌ర‌ఫున అనంత పురం జిల్లా రాయ‌దుర్గం నుంచి ఒక‌సారి ఎంపీగా విజ‌యం సాధించారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో చివ‌రి నిముషంలో పార్టీ టికెట్ సంపాయించుకుని ఇక్క‌డ నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆశీస్సుల‌తో ఆయ‌న‌కు చీఫ్ విప్ ప‌ద‌వి ద‌క్కింది. ఇక‌, 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి వ‌ర్గంలో కూడా చంద్ర‌బాబు చోటి చ్చారు. వివాద ర‌హితుడిగా, మేధావిగా పేరు తెచ్చుకున్న కాల్వ‌కు ఈ ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉంటుంది?  సొంత పార్టీ టీడీపీ నుంచి ఆయన‌కు ఆశించిన మేర‌కు మ‌ద్ద‌తు ల‌భించిందా? అనే సందేహాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. 

ఈ ద‌ఫా రాయ‌దుర్గం టీడీపీలో అనేక సంచ‌నాలు చోటు చేసుకున్నాయి. 2014 ముందు వ‌ర‌కు కూడా కాంగ్రెస్‌లో ఉండి, రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆ పార్టీకి బై చెప్పి.. చంద్ర‌బాబుకు జై కొట్టిన జేసీ బ్ర‌ద‌ర్స్ ఒక‌రు అనంత‌పురం ఎంపీగా మ‌రొక‌రు తాడిపత్రి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, ఈ ద‌ఫా రాయ‌దుర్గం టికెట్ ను తాడిప‌త్రి ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి అల్లుడు దీప‌క్‌రెడ్డి క‌న్నేశారు. రెండేళ్ల ముందు నుంచే ఇక్క‌డ ఆయ‌న ప్రచారం ప్రారంభించారు. భారీ ఎత్తున నిధులు ఖ‌ర్చుపెట్టి పార్టీ శ్రేణుల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో టికెట్ల కేటాయింపు విష‌యానికి వ‌చ్చే స‌రికి కాల్వ వ‌ర్సెస్ దీప‌క్ రెడ్డిల మ‌ధ్య పోరు సాగింది. 

అయితే, చివ‌రి నిముషంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకుని కాల్వ‌కు టికెట్ ఇచ్చి దీప‌క్‌ను స‌ముదాయించారు. ఇలా ఆదిలోనే ఎదురీత‌ను ఎదుర్కొన్న మంత్రి కాల్వ‌కు..ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థికాపు రామ‌చంద్రారెడ్డి నుంచి మ‌రింత గ‌ట్టిపోటీ ఎదురైంది. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీచేసిన కాపు.. విజ‌యం సాధించి వైఎస్ కు అత్యంత ప్రియ అనుచ‌రుడిగా గుర్తింపు సాధించారు. వైఎస్ మ‌ర‌ణంతో ఆయ‌న జ‌గ‌న్‌కు జై కొట్టారు. అప్ప‌ట్లో 2012లో జ‌రిగిన ఉప పోరులో ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, 2014లో మాత్రం ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి తీరాల‌నే క‌సితో ప్ర‌చారం చేశారు. డ‌బ్బులు కూడా బాగానే ఖ‌ర్చు చేశారు. 

ఈ నేప‌థ్యంలో మంత్రి కాల్వ‌కు ఎదురు గాలి త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఆయ‌న బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆ వ‌ర్గం ఓట్లు స‌హా బీసీ వ‌ర్గాలు అండ‌గా ఉన్న నేప‌థ్యంలో ఏంజ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అదే టైంలో అటు కాపు రామ‌చంద్రారెడ్డిపై సానుభూతి ప‌వ‌నాలు ఉన్నాయి. ఇటు మంత్రి కాల్వ‌కు సొంత పార్టీలోనే గ్రూపు త‌గాదాలు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో ఈ సారి కాల్వ గెలుపు అంత సులువు కాదు ?  మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: