ఎన్నికలకు మాత్రమే జరిగాయి. ఫలితాలు ఇంకా రావాల్సివుంది. అయితే అధికారంలోకి వచ్చేసినట్లుగా  అధికార టీడీపీ నాయకులు  మంత్రి పదవుల కోసం ఆశలు పెంచేసుకుంటున్నారు. ఈసారి తాము తప్పకుండా మంత్రి పదవికి చేపడతామని అన్ని రకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు. సామాజిక సమీకరణలు అన్నీ అధినేత తరహాలో బేరీజు వేసుకుని మరీ తమకు అమాత్య కిరీటం తప్పక వరిస్తుందని ధీమా ఒలకబోస్తున్నారు. ఈ తరహా అతి చేసే వారు టీడీపీలో ఇపుడు  ఎక్కువగా కనిపిస్తున్నారు.  మొత్తం విశాఖ జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున అధినేత   మార్పులు చేస్తారని తమ్ముళ్ళు గట్టిగా  భావిస్తున్నారు.


విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు ఈసారి మంత్రి వర్గంలో అవకాశం ఉండదని తమ్ముళ్ళు తమకు తామే  నిర్ణయించేశారు. అయిదేళ్ళ పాటు ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చినా జిల్లాలో పార్టీకి  ఏమీ చేయలేదన్న అసంత్రుప్తి అధినేత చంద్రబాబులో  ఉందని అంటున్నారు. పైగా వర్గ పోరుని పెంచి జిల్లాలో పార్టీ ఎదగకుండా చేశారని కూడా చెబుతున్నారు. దాంతో వారి స్థానంలో కొత్తవారికి చాన్స్ ఉంటుందని అంటున్నారు.



ఇలా ఆలొచించేవారిలో పెందుర్తి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ సౌత్ నుంచి పోటీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ నుంచి రంగంలో ఉన్న గణబాబు ఉన్నారు. వీరు మంత్రి పదవి కచ్చితంగా  తమను వరిస్తుందని ఆశ పెంచుకుంటున్నారు. ఇక భీమునిపటంలో అధ్బుతం జరిగి గెలిస్తే తాను మంత్రి తప్పకుండా అవుతానని సబ్బం హరి ఆశల పల్లకిలో వూరేగుతున్నారు. 



అదే విధంగా రూరల్ జిల్లాలో  జూనియర్ తమ్ముళ్ళు ఈసారి మంత్రి పదవుల కోసం రేసులో బాగానే కనిపిస్తున్నారు. మూడవసారి కనుక గెలిస్తే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంత్రి పదవి తనకు ఖాయమని అనుకుంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే రాజు కూడా మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. ఏజెన్సీలో చూసుకుంటే మళ్ళీ గెలిస్తే తనకు మంత్రి పదవి ఖాయమని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా లెక్కలేసుకుంటున్నారుట. చూడాలి మరి.  టీడీపీ ముందు  అధికారలోకి రావాలి. అపుడు కదా మంత్రి పదవుల ముచ్చట అని సొంత పార్టీలోని క్యాడరే  వీరిని ఎద్దేవా చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: