తెలంగాణ‌లో మ‌రోమారు రాజ‌కీయం హీటెక్కింది.  ఎన్నిక‌ల హోరాహోరీ పోరుకు వేదిక అయిన తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు మ‌రింత వేడిని రాజేశాయి. వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఉప ఎన్నిక విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. గత ఎన్నికల్లో నల్లగొండ స్థానం టీఆర్‌ ఎస్‌ చేజారగా ఉప ఎన్నికల్లో దానిని కూడా గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలగా ఉంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని, నిర్లక్ష్యం దరి చేరకుండా ప్రతిఓటు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధికి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించ డంతో నేతలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదనే ఒక్కో స్థానానికి ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీకి బాధ్యతలు అప్పగించింది. 


కీల‌క‌మై న‌ల్లగొండ ఎమ్మెల్సీస్థానంలో అనూహ్యంగా గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించగా, ఈ సారి కూడా ఆస్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన భార్య లక్ష్మిని నిలిపారు. ఈసారి కాంగ్రెస్‌ను మట్టికరిపించి బదులు తీర్చుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత ఎన్నికలలో ఓడిన తేరాచిన్నపరెడ్డినే టీఆర్‌ఎస్‌ ఈసారి అభ్యర్ధిగా నిలిపింది. మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌లకు నల్లగొండ ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించారు. వీరుకాకుండా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడేలా కృషిచేయాలని ఆదేశించారు. 


మ‌రోవైపు రంగారెడ్డి ఎమ్మెల్సీస్థానం గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలుచుకోగా, ఈసారి రసవత్తరపోరు నెలకొనే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీమంత్రి పట్నం మహేందర్‌ రెడ్డిని నిలపగా, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నిలిపారు. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండడంతో కొంత ఉత్కంఠ ఉన్నా, సునాయాసంగానే గెలుస్తామని టీఆర్‌ఎస్‌ అంచనావేస్తోంంది. టీఆర్‌ఎస్‌ ఓటర్లయిన జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లతో ముందుగానే పలుమార్లు సమావేశమైన మహేందర్‌రెడ్డి ఎన్నిక విషయంలో పకడ్బందీగానే ఉన్నట్లు కనబడుతోంది. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.


మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చూస్తారు. ఎమ్మెల్సీ ఓటర్ల క్యాంపుల నుండి ఓటు హక్కు వినియోగించుకునే వరకు సాగే ప్రక్రియను పర్య వేక్షించనున్నారు. నల్లగొండ స్థానికసంస్థల నియోజకవర్గంలో 1102మంది ఓటర్లుండగా, ఇందులో 800మందిని సౌత్‌ కాశ్మీర్‌గా పేరున్న కేరళలోని హిల్‌స్టేషన్‌ మున్నార్‌కు తరలించనున్నారు. ఈ మేరకు నల్లగొండ ప్రజాప్రతినిధులకు సమాచారం అందగా, ఇప్పటికే పలువురు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. గురువారం ఉదయం కల్లా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా హైదరాబాద్‌ చేరుకోవాలని ఆదేశాలు అందాయి. 800మందిని ఒకేచోటకు తరలించాలా...వేర్వేరు ప్రాంతాలకు తరలించాలా అన్నది హైదరాబాద్‌ వచ్చాక ఖరారుచేస్తారు. గ్రూపులవారీగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనుండగా, వారిపైన మంత్రులు, ఆపైన పార్టీ పరిశీలకులు క్యాంపుల వ్యవహారాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: