విశాఖలో ఓడిపోయే సీటు ఏదీ అంటే అరకు అని ఠక్కున చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు సమీక్షకు వెళ్ళిన కొందరు సీనియర్ నాయకులు అరకు సీటు పోతుందని చెప్పేశారట. కిడారి శ్రావణ్ కుమార్ ఎలక్షనీరింగ్ సరిగ్గా చేసుకోలేకపోయారని అంటున్నారు.  నిన్ననే మంత్రి పదవి పోయింది. ఇపుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే శ్రావణ్ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సమాధి అయినట్లేనని అంటున్నారు.


నిజానికి విశాఖ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు కిడారి సర్వేశ్వరరావు ఈ స్థాయికి రావడానికి ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ లో చిన్నపాటి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిడారి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనకు రాజ‌కీయ గురువు విశాఖలో సీనియర్ నేత కొణతాల రామక్రిష్ణ. ఆయన వల్లనే వైఎస్సార్ కిడారిని ఎమ్మెల్సీని చేశారు. ఆ తరువాత కొణతాలతో పాటు వైసీపీలో చేరిన కిడారి అదే కొణతాల సిఫార్స్ తో జగన్ పార్టీ నుంచి టికెట్ సాధించారు. 2014 ఎన్నికల్లో 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డ్ స్రుష్టించారు.


దానికి ముందు గిరిజన సమస్యలపై  గట్టి పోరాటం చేసి గిరిజనుల మన్ననలు అందుకున్నారు. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద పోరాటం చేశారో అదే ఎమ్మెల్యే సివేరి సోముని ఓడించి గెలిచారో తరువాత ఆయనతోనే కలసిపోయి సైకిలెక్కేయడం అమాయక గిరిజనానికి నచ్చలేదు. మొత్తానికి మావోయిస్టులు కిడారిని దారుణంగా హత్య చేశారు. ఇక కిడారి హత్య నాటికి ఆ కుటుంబంలో  ఎవరికీ రాజకీయ వాసనలు లేవు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగి. పెద్ద కుమారుడు శ్రావణ్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. కిడారి టీడీపీలో చేరి రెండేళ్లు గడచినా ఆయనకు మంత్రి పదవి హామీని తీర్చని చంద్రబాబు దారుణ హత్య తరువాత మాత్రం కొడుక్కి మంత్రి పదవి కట్టబెట్టేశారు. 


కిడారి చనిపోయిన తరువాత వచ్చిన సానుభూతిని రాజకీయంగా వాడుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కొడుక్కి మంత్రి పదవి ఇచ్చారని అపుడే విమర్శలు వచ్చాయి. ఆరు నెలల క్రితం మంత్రి పదవి ఇచ్చిన బాబుకు ఆయన్ని చట్ట సభల్లో ఏదో దానికి నెగ్గించాలన్న ఉద్దేశ్యం మాత్రం కనిపించలేదు. తొలిసారి అరకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ పెట్టారు. అయితే అంతకు ముందే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిడారికి టికెట్ ఇస్తే ఆయన ఈ రోజు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది కాదు. కిడారి ద్వారా ఒక సీటు రావాలన్న బాబు రాజకీయ ఎత్తుగడతో  శ్రావణ్ అవమానకరమైన రీతిలో రాజీనామా  చేయాల్సి.వచ్చింది.


 అది సరే కానీ ఇపుడు అరకు నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గాలి. అక్కడ చూస్తే టైట్ ఫైట్ జరిగింది. అవకాశాలు వైసీపీకే బాగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అంటే బాబు ఆశించిన లక్ష్యం నెరవేదన్న మాట. ఓ విధంగా కిడారి తో టీడీపీ రాజకీయ జూదం ఆడిందన్న మాట వినిపిస్తోంది. కిడారి ఎమ్మెల్యే అయినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా అయనకు మళ్ళీ  మంత్రి పదవి ఇస్తారా అన్నది కూడా డౌటే అంటున్నారు. అంటే కిడారి కుటుంబానికి రాజకీయంగా కలిగిన లాభమేంటి అని ఆలోచినపుడు ఏమీ లేదనే జవాబు వస్తుంది.


అదే కిడారి సర్వేశ్వరరావుకు మంత్రి పదవి హామీ మేరకు ఇచ్చినా అయన బతికి ఉండేవారు. ఇపుడు శ్రావణ్ ని ఎమ్మెల్సీ చేసినా రాజకీయంగా నిలదొక్కుకునేవారు. కానీ అలా జరగలేదు. ఇపుడు  అరకు ఫలితం తేలితేనే కిడారి రాజకీయ జీవితం ఏంటన్నది తెలుస్తుంది. మొత్తానికి ఆరు నెలల మంత్రిగా ఉన్న కిడారి ఇటు రాజకీయం కొనసాగించలేక అటు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేక ఎటూ కాకుండా పోతున్నారా అని కిడారి అనుచరులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: