ఇప్ప‌టికే హ్యాట్రిక్ ఓట‌మి చ‌విచూసిన ఓ ఎంపీ సీటుపై టీడీపీ మ‌ళ్లీ ఆశ‌లు వ‌దిలేసుకుంది. తాను ఓ గొప్ప వ్య‌క్తిని అంటూ క‌బుర్లు చెప్పుకునే చంద్ర‌బాబు త‌న సొంత జిల్లాలో ఉన్న ఎంపీ సీటును కూడా గెలిపించుకోలేని ప‌రిస్థితి. ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడుసార్లు ఓడినా ఇప్ప‌ట‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. క‌డ‌ప‌- చిత్తూరు జిల్లాల ప‌రిధిలో ఉన్న రాజంపేట లోక్‌స‌భ సీటులో మ‌రోసారి తిరిగి వైసీపీ జెండానే ఎగ‌ర‌నుంది. 2004, 09 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ సాయిప్ర‌తాప్ విజ‌యం సాధించారు.


ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న‌యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆయ‌న బీజేపీ నుంచి పోటీ చేసిన (టీడీపీ మ‌ద్ద‌తుతో) కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రిపై ఏకంగా 1.50 ల‌క్ష‌ల భారీ ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఐదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా మిథున్‌రెడ్డి ఎంపీగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు. మిథున్‌రెడ్డిని చూస్తే ఆయ‌న ప్ర‌తిప‌క్ష పార్టీ ఎంపీ అని ఎవ్వ‌రూ అనుకోరు.. అధికార పార్టీ ఎంపీగానే ప‌నులు చేశార‌న్న టాక్ కూడా ఉంది.


క‌డ‌ప జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు, చిత్తూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్ల ప‌రిధిలో ఉన్న రాజంపేట లోక్‌సభ సీటులో ఈ సారి టీడీపీ నుంచి స‌రైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న డీకే.స‌త్య‌ప్ర‌భ‌ను చంద్ర‌బాబు రంగంలోకి దింపారు. ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌లేదు. ఆమెను బాబు బ‌ల‌వంతంగా బ‌లిచేసిన‌ట్టే టాక్‌. జ‌గ‌న్‌ జిల్లా క‌డ‌ప‌లో ఈసారి ఫ్యాను స్పీడుకి బ్రేకులు వేయాల‌ని త‌హ‌త‌హ‌లాడిన చంద్ర‌బాబు ప్లాన్లు అన్ని రివ‌ర్స్ అయిన‌ట్టు పోలింగ్ స‌ర‌ళి చెప్పేసింది.


లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లోనూ వైసీపీ చాలా బ‌లంగా ఉండ‌డం మిథున్‌రెడ్డికి క‌లిసి వ‌చ్చే అంశం. ఈ సారి ఆయ‌న మెజార్టీ 2 ల‌క్ష‌లు దాటుతుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. క‌డ‌ప జిల్లాలోని రాజంపేట‌, రైల్వే కోడూరు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ బ‌లంగా ఉంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే మిథున్‌కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు, పీలేరు, మ‌ద‌న‌ప‌ల్లె, తంబ‌ళ్ల‌ప‌ల్లెలో పుంగ‌నూరులో మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఉన్నారు. అక్క‌డ భారీ మెజార్టీ గ్యారెంటీ.


ఇక మిగిలిన నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు జ‌రిగినా వైసీపీకే ఆధిక్యం క‌న‌ప‌డుతోంది. తంబ‌ళ్ల‌ప‌ల్లె, మ‌ద‌న‌ప‌ల్లె, పీలేరు లాంటి చోట్ల టీడీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే ఎంపీకి వ‌చ్చేస‌రికి మిథున్‌రెడ్డికి అనుకూలంగా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఏదేమైనా రాజంపేట ఎంపీ సీటు విష‌యంలో టీడీపీ మ‌రో ఐదేళ్ల పాటు వేచి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: