ఏడు విడ‌త‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓ వైపు తుది వైపు పోలింగ్ సాగుతుండ‌గా...మ‌రోవైపు ఫ‌లితాల కార్యాచ‌ర‌ణ‌...ఈ సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఆయా పార్టీలు త‌మ వ్యూహాల‌ను క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఏ జాతీయ పార్టీకి పూర్తి మెజార్టీ రాద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న నేప‌థ్యంలో కొత్త ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్రంలో కర్ణాటక పాలసీ తెర‌మీద‌కు వ‌చ్చింద‌ని అంటున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడుగుల‌తో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.


ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో ఎక్కడా కనిపించని సోనియా.. చివరిదశలో రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అవసరమైతే ప్రధాని అయ్యే అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలకు ఇచ్చి, తాము వెనుకుండి నడిపించాలని సోనియాగాంధీ భావిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉండే కన్నా.. ఒకటి రెండు పెద్ద పార్టీలు ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆమెకు తెలుసు. ఇప్పటికే యూపీఏ-1, యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఆమెకు ఉంది. కాబట్టి ఈసారి హంగ్ పరిస్థితులు ఏర్పడితే ప్రధాని అవకాశాన్ని అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రాంతీయ పార్టీకి ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలోని ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మాయావతి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


అధిక స్థానాలు సాధించే పార్టీగా బీజేపీ నిలుస్తుందనేది సుస్పష్టం. ఆ పార్టీకి 180-190 వరకు సీట్లు వస్తాయని అంచనా. కాంగ్రెస్ పార్టీ 120-130 మధ్య ఆగొచ్చంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. మరోవైపు ప్రధాని మోదీని గద్దెదింపడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కదుపుతున్నది. అవసరమైతే ప్రధాని పదవి వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల అన్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ కుమార‌స్వామి ఎవ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: