సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం మాట‌ల యుద్ధం సాగుతోంది. ఎగ్జిట్‌పోల్స్ ఈ మాట‌ల దాడిని మ‌రింత పెంచాయి. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ, టీడీపీల మ‌ధ్య జ‌రిగిన విమ‌ర్శల‌ ప‌ర్వం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ... నారా టీడీపీ..! నందమూరి టీడీపీగా చీలిపోతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. దీనికి ప్ర‌తిగా బీజేపీ వ్యాఖ్య‌లు కుట్ర జ‌రుగుతోంద‌నే అనుమానాన్ని రేకెత్తించాయ‌ని టీడీపీ సందేహం వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లేం జ‌రుగుతోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో  సైకిల్‌లో గాలి లేదని తెలుస్తోందని.. ఎన్నికల ఫలితాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌నున్నాయ‌ని అన్నారు. ఫ‌లితాల అనంత‌రం టీడీపీ.. నారా పార్టీ, నందమూరిపార్టీగా విడిపోనుంది.. రెండుగా నిట్టనిలువునా చీలిక రానుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థానం ఉండదనే ఉనికి కోసమే చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు కొత్త డ్రామా ఆడారని ఆరోపించారు. ఏపీ మాజీ సీఎస్ పునేఠ తొలగింపుకు కారణం ఎవరో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. 


కాగా, బీజేపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, కౌంట‌ర్  ఇచ్చారు. టీడీపీ రెండుగా చీలిపోతుందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీని వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. బీజేపీ రెండుగా చీలిపోతుందేమో చూసుకోండి! అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అశోక్ బాబు ఆరోపించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్సీలు...ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ముడిపెట్టి...ప‌ర‌స్ప‌రం పార్టీల చీలిక గురించి వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: