రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర అంటూ నడుస్తున్న వ్యవహారంలో రాష్ట్రంలో ఆదివారం సరికొత్త దుమారం లేచింది, విభజన అంశాన్ని మరింత ముదిరేలా చేసింది అంటున్నారు. సకలజనుల భేరిలో కేసిఆర్ చేసిన వాఖ్యలు కంపరం పుట్టించాయి. ఆయన వాడిన పదాలు సర్వత్రా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. సీమాంద్ర, తెలంగాణ అంటూ భేదం లేకుండా ఇరుప్రాంతాల సీనియర్లు కేసిఆర్ మాటలను విభేదించారు. మాటల తీరు విమర్శలకు దారితీయడం మాట అటుంచితే ఆయన లేవనెత్తిన అంశాలు, ఆరోపణలు మాత్రం దుమారం లేపాయి.

ఇక ఆయన మాటల విషయానికి వస్తే ఆంద్రలో పుట్టినోళ్లంతా తెలివి లేనోళ్లు, లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులు, ఆంద్రలో పుట్టినోళ్లంతా తెలంగాణ ద్రోహులు, కిరణ్ కుమార్ రెడ్డి బేవ్ కూఫ్ ముఖ్యమంత్రి, అక్టోబరు ఆరో తారీఖు ఆయనకు ఆఖరు రోజు అంటూ చేసిన కేసిఆర్ వాఖ్యలు సమైక్య ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతే కాదు హైదరాబాద్ విషయంలో తాము ఉమ్మడి రాజధానికోసం సాటి తెలుగువాళ్లుగా ఆమోదిస్తే, సేవ్ ఏపి సభతో ఆ అవకాశాన్ని కూడా వారు కోల్పోయారు, ఇక పదిసెకన్లు కూడా కలిసి ఉండలేని పరిస్థితి అంటూ ఆయన చేసిన వాఖ్యలు సమైక్యఉద్యమానికి మరింత ఆజ్యం పోసాయి, వారిలో మరింత కసిని పెంచాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అంతే కాదు తెలంగాణ ఏర్పాటును ఇరు ప్రాంతాల వారిని ఒప్పించే విదంగా హైదరాబాద్ పై నిర్ణయం తీసుకుని చేద్దామనుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ను సకలజనుల భేరి సందిగ్దంలో పడేసింది. హైదరాబాద్ తో కూడిన పదిజిల్లాల తెలంగాణ తప్ప ఏది చేసినా ఇక సమరమే అంటూ నినదించడం రాష్ట్ర విభజన అంశాన్ని మరింత జఠిలం చేసిందంటున్నారు. అంతే కాదు కేసిఆర్ తో సహా పలువురు ముఖ్యనేతలు సాగునీటిపై చేసిన వాఖ్యలు సీమాంద్రలో ఇప్పటికే నెలకొన్న భయాందోళనలకు మరింత ఆజ్యం పోసిందంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజనపై ప్రస్తుతం జరుగుతున్న రగడను ఈ భేరి మరింత ముదిరేలా చేసిందన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: