ఈశాన్య రాష్ర్టాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రం అసోం. భౌగోళికంగా ఇది ఎంతో ప్రాధాన్యమైన ఈ రాష్ట్రం తెగలు, జాతుల మధ్య వైరుధ్యాలు, వేర్పాటువాద ఉద్యమా లు, అక్రమ చొరబాట్లతో నిత్యం అశాంతికి నిలయమైంది. ఆరు సరిహద్దు రాష్ర్టాలను దేశంతో కలిపి ఉంచుతున్న కీలక భాగంలో ఇది ఉంది. ఈశాన్య రాష్ర్టాల్లోనే అత్యధికంగా 14 లోక్‌సభ స్థానాలున్న అసోం.. రాజకీయంగానూ ప్రముఖమైనది. మూడు దశల్లో ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ అసోం కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచింది. మధ్యలో కొన్ని సంవ‌త్స‌రాలు జనతాపార్టీ, అసోం గణపరిషద్ పాలించినా అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగింది.


2014లో మోదీ హవాతో కాంగ్రెస్ కోటకు బీటలువారాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7, కాంగ్రెస్-3, ఏఐయూడీఎఫ్-3 స్థానాల్లో గెలుపొందగా, ఓ చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూ బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల‌ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి చెందిన శర్బానంద సోనోవాల్ సీఎం అయ్యారు.అయితే, బీజేపీకి ఇక్క‌డ ప్ర‌స్తుతం గెలుపు ద‌క్క‌డం అంత సుల‌భం కాదంటున్నారు. అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును మోదీ సర్కారు తీసుకురావడంపై అసోం సహా ఈశాన్య రాష్ర్టాలన్నీ భగ్గుమన్నాయి. బీజేపీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ (ఏజీపీ)తోపాటు విపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా గత జనవరిలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఏజీపీ.. మార్చిలో తిరిగి అదేగూటికి చేరింది. జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్సీ) అంశం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.

40 లక్షల మంది ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రజల్లో ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్తగా ఆరు సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చడం, అసోం ఒప్పందంలోని క్లాజ్-6ను అమలు చేసేందుకు అత్యున్నత కమిటీ నియామకం, రాష్ర్టానికి చెందిన ప్రముఖ గాయకులు భూపేన్ హజారికాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. అయితే పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీ విషయంలో బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి: