ఈశాన్య రాష్ట్రాల్లో కీల‌క‌మైన అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో 7,94,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,01,601 మంది మహిళలు. మొత్తం 2,202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ రాష్ట్రంలో మొత్తం రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటానగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నహర్‌లగన్‌లో ఉన్న 52వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 1,340 మంది ఓటర్లు ఉండగా, చైనా సరిహద్దులో గల అంజా జిల్లాలోని మాలొగామ్ కేంద్రంలో ఒకే ఒక మహిళా ఓటరు ఉన్నారు. 13,583 అడుగుల ఎత్తులో ఉన్న తవాంగ్ జిల్లాలోని లుగుథంగ్ పోలింగ్ కేంద్రం రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్. మొట్టమొదటిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో(ఈవీఎం) పాటు వీవీప్యాట్ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. సర్వీస్ ఓటర్ల కోసం తొలిసారి ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌ను వినియోగించారు. 
 
అరవై స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీ నుంచి 48 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) నుంచి ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరుణాచల్ ప్రదేశ్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో నబం తుకీ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గంపగుత్తగా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో చేరారు. ఆ తర్వాత బీజేపీలో విలీనమయ్యారు.


అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఎన్‌పీపీ, పీపీఏ, జనతాదళ్ (సెక్యులర్) ప్రధాన పార్టీలు. అభివృద్ధి నినాదంతో అధికార బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా, అవినీతి, శాంతిభద్రతలతోపాటు పీఆర్‌సీ (శాశ్వత నివాస ధ్రువపత్రాలు) అంశాన్ని విపక్షాలు లేవనెత్తనున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 42 సీట్లు సాధించగా, బీజేపీ 11 సీట్లకు పరిమితమైంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) ఐదు స్థానాల్లో విజయం సాధించగా, రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. అయితే, తాజా ఎన్నిక‌ల్లో అన్ని ప్ర‌ధాన పార్టీల మ‌ద్య హోరాహోరీ పోరు న‌డిచిన‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: