ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు సెంటిమెంట్‌కు బ‌ల‌య్యారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌నపై పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబు ఘ‌న‌విజ‌యం సాధించారు. మొత్తానికి స్పీక‌ర్‌గా ఉండి పోటీ చేసిన వారు ఓడిపోతార‌న్న సంప్ర‌దాయం మ‌రోసారి కోడెల విష‌యంలో రుజువైంది. ఇక ఈ ఎన్నిక‌ల్లో కోడెల‌పై అంబ‌టి రాంబాబు 20 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో విజ‌యం సాధించారు. అంబ‌టి రాంబాబుకు 1.02 ల‌క్ష‌ల ఓట్లు రాగా.. కోడెల‌కు కేవ‌లం 82 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక జ‌న‌సేన నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే య‌ర్రం వెంక‌టేశ్వ‌ర‌రెడ్డికి 9 వేల ఓట్లు వ‌చ్చాయి. 


కోడెల ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌ని ముందునుంచి అంచ‌నాలు ఉన్నాయి. కేవ‌లం ఆయ‌న త‌న‌యుడు శివరాం ఎఫెక్ట్ ఈ ఎన్నిక‌ల్లో ఎక్కువుగా ఉంటుంద‌న్న చ‌ర్చ ఎన్నిక‌ల‌కు ముందే వ‌చ్చింది. ఇప్పుడు ఈ ఫ‌లితం ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. కోడెల త‌న‌యుడు వ‌సూలు చేసిన కేఎస్‌పీ ట్యాక్స్ దెబ్బ‌తోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌డంతో పాటు స్పీక‌ర్‌గా ఉన్న కోడెల ఓడిపోయారు. స్పీక‌ర్ గా ఉండి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారు గెలుస్తారా?  ఓడిపోతున్నార‌నే సంప్ర‌దాయాన్ని ఈయ‌న బ్రేక్ చేస్తారా? అనే చ‌ర్చ‌కు తెరదీసిన నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లిలో ఆ సెంటిమెంట్ కోడెల బ్రేక్ చేయ‌లేక‌పోయారు.


ఇక్క‌డ నుంచి 2014లో కేవ‌లం 780 ఓట్ల తేడాతో విజ‌యం సాధించిన సీనియ‌ర్ పొలిటీష‌య‌న్‌.. కోడెల శివ‌ప్ర‌సాద్ త‌ర్వాత కాలంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆశించినా.. ద‌క్క‌లేదు. పైగా ఆయ‌న ఊహించ‌ని విధంగా స్పీక‌ర్ ప‌ద‌వి వ‌రించింది. అయితే, మ‌ధ్య‌లోనే మంత్రిగా వెళ్లాల‌ని భావించినా.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగ‌లేదు. దీంతో స్పీక‌ర్‌గానే క‌డ‌వ‌ర‌కుకొన‌సాగారు. అయితే, స్పీక‌ర్‌గా ఉండి ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన వారు ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ లేక పోవ‌డంతో తాజా ఎన్నిక‌ల్లో కోడెల‌కు ఈ సెంటిమెంట్ ప‌ట్టుకుంది. 


ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాలైన అంబ‌టి రాంబాబుకే జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌డంతో ఇక్క‌డ పోటీ రంజుగా సాగింది. ఎన్నిక‌ల రోజు ఘ‌ర్ష‌ణ‌లు, స్పీక‌ర్ చొక్కా చిరిగిపోవ‌డం, క‌ళ్ల‌జోడు ప‌గిలి పోవ‌డం, రెండు మూడు బూతుల్లో రీపోలింగ్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆక‌ర్షించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అంబ‌టి గెలుపు గుర్రం ఎక్క‌డంతో స‌త్తెన‌ప‌ల్లిలో అంబ‌టి హ‌వా స్టార్ట్ అయిన‌ట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: