ముందు నుంచి మంగ‌ళ‌గిరిలో చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ గెలుపుపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తూ అక్క‌డ ఆయ‌న ఓడిపోయాడు. మంగ‌ళ‌గిరిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లోకేష్‌పై 5 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజ‌యం సాధించారు. ఆళ్ల‌కు 1.05 ల‌క్ష‌ల ఓట్లు రాగా... లోకేష్‌కు 99 వేల ఓట్లు వ‌చ్చాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గ ఫ‌లితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిరేగిన సంగ‌తి తెలిసిందే. ఓ విధంగా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి పెద్ద రిస్క్ చేశార‌న్న టాక్ కూడా ముందే వ‌చ్చింది.


దాదాపు 500 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే బెట్టింగులు క‌ట్టిన ఏకైక నియోజ‌క‌వ‌ర్గంగా గుర్తింపు తెచ్చుకుంది గుంటూరు జిల్లాలోని ఈ కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ తొలిసారి పోటీకి దిగ‌డంతో ఇక్క‌డ అంచ‌నాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. ఇక‌, ఇదే స‌మయంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని అనేక రూపాల్లో కోర్టుకు లాగి, నానా ర‌చ్చ చేసిన వైసీపీ ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికే జ‌గ‌న్ మ‌రోసారి ఇక్క‌డ నుంచి టికెట్ కేటాయించారు. స్థానికంగా ప‌ట్టుండ‌డంతో ఇక్క‌డ లోకేష్‌, ఆళ్ల‌ల మ‌ధ్య హోరా హోరీ పోరు సాగింది. 


ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే మంగ‌ళ‌గిరిని, మంద‌ల‌గిరి అంటూ వ్యాఖ్యానించి వార్త‌ల్లో నిలిచారు మంత్రి నారా లోకేష్‌, ఇక‌, ఎన్నిక‌ల రోజు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు బూతుల్లో కూర్చుని మ‌రీ ప్ర‌జ‌ల‌ను బూతుల‌కు ర‌ప్పించేలా చ‌ర్య‌లు తీసుకు న్నారు. తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతోపాటు చంద్ర‌బాబు వార‌సుడిగా కూడా ఆయ‌న గెలిచి తీరాల‌నే నెసిసిటీ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఇక్క‌డి ఎన్నిక‌లు లోకేష్‌కు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. ఇక‌, నారా లోకేష్‌ను ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఓడించి, రికార్డును సృష్టించాల‌ని ఆళ్ల ప్ర‌య‌త్నించారు. 


ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో లోకేష్‌ను ఓడిస్తే ఆర్కేకు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని కూడా జ‌గ‌న్ ఆర్కేకు హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే ఆర్కే గెలిచి చూపించారు. ఇప్పుడు ఆయ‌న‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే మిగిలి ఉంది. తాడేప‌ల్లి మునిసిపాలిటీ, రూర‌ల్ మండ‌లాల నుంచి వ‌చ్చిన మెజార్టీల‌తోనే ఇక్క‌డ ఆర్కే విజ‌యం సాధించారు. ఇక తొలిసారే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన లోకేష్‌కు ఈ ఓట‌మి కెరీర్‌లోనే ఓ పెద్ద పీడ‌క‌ల లాంటిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: