తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం ఈ సారి అత్యంత ఆస‌క్తి రేపింది. ఈ ఎన్నిక‌ల్లో గ‌త ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డిన ప్ర‌త్య‌ర్థులే మ‌ళ్లీ త‌ల‌ప‌డ్డారు. అయితే వీరిద్ద‌రు ఈ సారి పార్టీలు మారారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ విజ‌యం సాధించి ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నెహ్రూ చేతిలో ఓడిన చంటిబాబు ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈ హోరాహోరీ పోరులో 24 వేల ఓట్ల తేడాతో చంటిబాబు గెలిచారు. నెహ్రూకు 69 వేల ఓట్లు రాగా... చంటిబాబుకు 93 వేల ఓట్లు వ‌చ్చాయి.


జ‌గ్గంపేట గెలుపు విష‌యంలో ఆది నుంచి కూడా అనేక విధాలుగా స‌స్పెన్స్ కొన‌సాగింది. బాబాయి వ‌ర్సెస్ అబ్బాయిగా సాగిన ఈ ఎన్నిక‌ల పోరులో ఎవ‌రు పైచేయి సాధిస్తార‌నే ప్రచారంఆది నుంచి కొన‌సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో జ్యోతుల వెంక‌ట అప్పారావు, ఉర‌ఫ్ నెహ్రూ ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున విజ‌యం సాధించి, త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిపోయారు. ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న అబ్బాయ్ జ్యోతుల చంటిబాబు.. వైసీపీలో చేరి టికెట్ సాధించ‌డం ఇక్క‌డ ఉత్కంఠ‌ను మ‌రింత పెంచింది. ఇక‌, జ‌గ‌న్ నిర్వ‌హించిన పాద‌యాత్ర షెడ్యూల్‌లో జ‌గ్గంపేట లేక‌పోయినా.. రాత్రిరాత్రి దీనిని షెడ్యూల్‌లో చేర్చి పాద‌యాత్ర చేశారు. 


అదే విధంగా కాపుల ఓట్లు బ‌లంగా ఉన్న ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌నే ప్ర‌చారం కూడా ఊపందుకుంది. కాపుల క‌రుణ ఎవ‌రికి అటు బాబాయ్‌కా? ఇటు అబ్బాయ్‌కా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో హోరా హోరీగానే ప్ర‌చారం కూడా సాగింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు నుంచి ఇక్క‌డ బెట్టింగులు కూడా సాగ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇద్ద‌రూ టీడీపీ, వైసీపీ జెండాల‌పై పోటీ చేసినా. వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను ఎక్కువ‌గా ఉప‌యోగించుకున్నారు. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే ఆస‌క్తి పెరిగింది. మొత్తానికి తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బాబాయ్‌పై అబ్బాయ్ స‌త్తా చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: