కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ రోజున ఎంత తీవ్ర‌మైన ఉద్రిక్త‌లు త‌లెత్తాయో చూశాం. ఇప్పుడు పోలింగ్ రోజున కూడా గ‌న్న‌వ‌రంలో అంతే స్థాయిలో తీవ్ర‌మైన టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌ర‌కు ఈ పోరులో సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుపై 1166 ఓట్ల స్వ‌ల్ప ఆధిక్యంతో విజ‌యం సాధించారు. గ‌న్న‌వ‌రంలో ముందునుంచి టీడీపీ ఆధిక్యంలో ఉన్నా చివ‌ర్లో విజ‌యం వైసీపీతో కూడా దోబూచులాడింది. వంశీకి 95,995 ఓట్లు రాగా... వెంక‌ట్రావుకు 94,829 ఓట్లు వ‌చ్చాయి. 


ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం. కృష్ణాజిల్లాలో వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై అనేక పుకార్లు షికారు చేశాయి. ఆయ‌న అసలు పోటీలోనే ఉండ‌ర‌ని, నామినేష‌న్‌ను కూడా వెన‌క్కి తీసుకుంటార‌ని, తెలంగాణ నుంచి ఒత్తిడు లు అధిక‌మ‌య్యాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్క‌సారిగా హైప్ వ‌చ్చింది. టీడీపీ టికెట్‌పై పోటీ చేయ‌డంతోపాటు తాజా ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌నే క‌సితో ఆయ‌న ఇక్క‌డ హోరా హోరీ ప్ర‌చారం నిర్వ‌హించారు. 


ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావునుజ‌గ‌న్ తెర‌మీదికి తెచ్చారు. వంశీ, యార్ల‌గ‌డ్డ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కావ‌డం, ఇరు ప‌క్షాల అభ్య‌ర్థులు ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, మేనిఫెస్టోలు కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంపై అత్యంత ఆస‌క్తి నెల‌కొంది. దీనికితోడు ఎన్నిక‌ల పోలింగ్ నాడు జ‌రిగిన వివాదాలు, త‌దుప‌రి ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీనే అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, తాజాగా వెల్ల‌డైన ఫ‌లితాల‌తో గ‌న్న‌వ‌రం వీరుడు వంశీయే అని తేలిపోవ‌డంతో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఇక ఇంత భ‌యంక‌ర‌మైన వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకుని వంశీ విజ‌యం సాధించ‌డం వెన‌క ఆయ‌న ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ చాలా ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: