ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ అఖండ విజయం సాధించారు. నభూతో న భవిష్యత్ అన్నంతగా 175కు 151 సీట్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరి జగన్ ఇంతగా విజయం సాధించడానికి కారణాలేంటి.. ఈ కారణాలను ప్రముఖ దిన పత్రిక అద్భుతంగా విశ్లేషించింది. జగన్ గెలుపునకు మొత్తం 9 కారణాలు పని చేశాయంటూ ఆ పత్రిక చేసిన విశ్లేషణ వివరణాత్మకంగా ఉంది.


కారణం నెం. 1: పాదయాత్ర

2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, 2014 ముందు చంద్రబాబు తరహాలోనే జగన్‌ కు కు పాదయాత్ర జనానికి మరింత దగ్గర చేసింది. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3,648 కి.మీ కొనసాగిన యాత్ర దారి పొడవునా ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. 

కారణం నెం. 2: నవరత్నాలు
వైకాపా ప్రకటించిన నవరత్నాలు ప్రజలను ఆకట్టుకున్నాయని ఈ పత్రిక అభిప్రాయపడింది. వైఎస్సార్‌ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, యువత-ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ గృహనిర్మాణం, బీసీ సంక్షేమం అంశాలను నవరత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

కారణం నెం. ౩: ప్రత్యేక హోదాపై పోరు 
ప్రత్యేక హోదా గురించి మాట మార్చని జగన్ తీరు ప్రజలకు నచ్చిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. పార్లమెంట్‌ లోపలా, వెలుపలా ఆ పార్టీ పోరాడింది. జిల్లాల వారీగా సభలు నిర్వహించింది. మొదటి నుంచీ ఒకే వైఖరితో ఉండటం వైసీపీకి కలసివచ్చింది. 

కారణం నెం. 4: చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత
అధికారపార్టీపై సహజంగా ప్రజల్లో ఉండే అసంతృప్తిని వైకాపా తమకు అనుకూలంగా మలచుకుంది. తెదేపా నేతల ప్రచారార్భాటం ఆ పార్టీని దెబ్బతీసింది. జన్మభూమి కమిటీలపై ఉన్న వ్యతిరేకత వైకాపాకు మేలు చేసింది. 

కారణం నెం. 5: మహిళల ఆదరణ
చివరి రోజుల్లో టీడీపీ ప్రయోగించిన పసుపు కుంకుమకు ధీటుగా వైకాపా ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు ఏటా రూ.15వేలతో పాటు ఎన్నికల నాటికి ఉన్న రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తామని జగన్‌ ప్రకటించడం కలసి వచ్చింది.  తండ్రిలా ఇచ్చిన మాటను జగన్‌ నిలబెట్టుకుంటాడన్న ఆశ కలసివచ్చింది. 

కారణం నెం. 6: రైతుల మొగ్గు 
వైసీపీ అధికారంలోకి రాగానే  ఏటా మే నెలలో పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని ఇచ్చిన హామీ బాగా వర్కవుట్ అయ్యింది.  నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టింది. ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.50వేలు లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చింది. 

కారణం నెం. 7: టీడీపీ నుంచి వలసలు
ఎన్నికల సీజన్ మొదలైన నాటి నుంచి ఓ వ్యూహం ప్రకారం టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించింది. జిల్లాల్లో సీనియర్లు, సామాజిక వర్గాల వారీగా కీలకపాత్ర పోషిస్తున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది. అవంతి శ్రీనివాస్‌, తోట నర్సింహం, పి. రవీంద్రబాబు, సినీనటుడు అలీ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, యలమంచిలి రవి వంటి వారు క్యూకట్టారు. 

కారణం నెం. 8: ఒక్క ఛాన్స్.. 
జగన్ పై జనంలో ఉన్న సానుభూతి.. ఒక్క అవకాశమిద్దాం అన్న ఆలోచన ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపించింది. గతంలోనూ ముఖ్యమంత్రి అవకాశం చేతులవరకూ వచ్చి వెనక్కి వెళ్లడం సానుభూతిని పెంచింది. 

కారణం నెం. 9: పీకే డైరక్షన్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు జగన్ కు బాగా కలసివచ్చాయి. పార్టీని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి.. దాని ప్రకారమే ముందుకు వెళ్లడం కలసివచ్చింది. ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే ప్రకారమే జగన్ టికెట్లు ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: