151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో భారీ మెజార్టీతో 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న ఎన్నిక‌ల హామీలు, ఇత‌రత్రా కార్యాచ‌ర‌ణ‌ను సైతం ఆయ‌న సిద్ధం చేస్తున్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత ఈ స‌మావేశం ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. 


మరోవైపు ప్రత్యేక హోదా నినాదాన్ని వైఎస్ జగన్ 2014 ఎన్నికల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల తరువాత ప్రతిపక్షంలో ఉంటూ ప్రత్యేక హోదానే మా నినాదం అంటూ దీక్షలు కూడా చేశారు. అంతేకాదు అటు లోక్‌సభలోనూ తన ఎంపీల చేత రాజీనామా చేయించారు. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఈ నినాదాన్నే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో యుద్ధానికి సిద్ధమని.. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదంటూ జగన్ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. గెలిచిన అనంత‌రం సైతం ఆయ‌న మాట మార్చ‌లేదు. 


తాజా ఎన్నికల ఫలితాల్లో ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 22 లోక్‌సభ సీట్లను సొంతం చేసుకొని.. పార్లమెంట్‌లో అతిపెద్ద నాలుగవ పార్టీగా రికార్డు సృష్టించారు. ఇక ఈ విజయంపై జగన్ గురువారం మాట్లాడుతూ.. ‘‘అద్భుత విజయాన్ని సాధించాం. కానీ ఈ సీట్లతో ప్రత్యేక హోదాను తీసుకురావడం కష్టమే అవుతుంది. కానీ హోదాపై మా ఉద్యమాన్ని మాత్రం ఆపం. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకొని హోదా గురించి ఆయనకు వివరిస్తాను. మా డిమాండ్లను నెరవేర్చుకునే వరకు పోరాడుతాం’’ అంటూ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: