చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశంపార్టీ మొదటి వికెట్ డౌన్ అయ్యింది.  మొన్నటి ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి టిడిపి తరపున పోటీ చేసిన అనగంటి హరికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి పదవితో పాటు పార్టీ ప్రాధనమిక సభ్యత్వానికి కూడా అనగంటి రాజీనామా చేయటం పార్టీలో కలకలం మొదలైంది.

 

మొన్ననే పార్టీలో సీనియర్ నేత ఉన్న నీలం బాలాజీ  పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నీలం పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేయగా అనగంటి ఏకంగా పార్టీకే రాజీనామా చేసేశారు. అనగంటిపై వైసిపి అభ్యర్ధి నారాయణస్వామి సుమారు 46 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఎన్నికల్లో తనను ప్రజలు తిరస్కరించినందుకే తాను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పటం గమనార్హం.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం అందరికీ తెలిసిందే. పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు తో సహా మాజీ మంత్రులు, నేతలు ఎవరు కూడా అడ్రస్ కనబడలేదు. ఇటువంటి నేపధ్యంలోనే పార్టీలో ఎంతమంది ఉంటారు ? అనే ప్రశ్న నలుగుతోంది నేతల మధ్య. అలాంటిది చంద్రబాబు సొంత జిల్లాలోనే అనగంటి రాజీనామాతో  ఇంకా ఎంతమంది ఫాలో అవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: