కౌంటింగ్ ముందు రోజు వరకూ రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన చంద్రబాబు ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఘోరాతిఘోరంగా ఓడిపోయారు. టీడీపీ అనుకూల మీడియావే ఇంతటి దారుణమైన ఓటమి టీడీపీ చరిత్రలో ఎక్కడా లేదని తేల్చేసింది. మరి ఇంత పరాభవం తరువాత చంద్రబాబు దిద్దుబాట్లు, తీసుకునే చర్యలు  ఏంటి.


రాహుల్ గాంధీ  అయితే తాను కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహించి అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఎందరు చెప్పినా తన డెసిషన్ మారదు అంటున్నారు. నిజంగా అది గొప్ప నిర్ణయం. ప్రజాస్వామ్యం పరిమళించే నిర్ణయం. కుటుంబం, వ్యక్తి పూజ కాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలన్నది రాహుల్ ఆలోచన. తాను కార్యకర్తగా ఉంటానని ఆయన చెప్పేశారు. దానికి సోనియాగాంధీ కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్నాళ్ళు అన్నది పక్కన పెడితే రాహుల్ ఓ డేరింగ్ స్టెప్ వేశారు. పార్టీ ఓటమికి  అధినేతగా బాధ్యత తీసుకుని తనకు తాను శిక్ష వేసుకున్నారు.


మరి ఏపీలో సర్వం తానే అయి పార్టీని నడిపిన చంద్రబాబు ఇపుడు  జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా. ఈ దారుణమైన ఫలితాలకు ఆయన తనను తాను శిక్షించుకుంటారా. నిజానికి కాంగ్రెస్ కంటే కూడా టీడీపీలో ప్రజాస్వామ్యం అంటే అసలు లేదంటారు. అన్నీ బాబు గారి నిర్ణయాలే. కాంగ్రెస్ లో  అత్యున్నత వేదిక సీడబ్లూసీ అని ఒకటి ఉంది. అక్కడ కొంతవరకైనా నిర్ణయాలు ఉంటాయి. మరి బాబు ఇక్కడ నంది అంటే నంది అనాల్సిందే.


ఉదాహరణకు  కాంగ్రెస్ తో పొత్తు వద్దని టీడీపీలో సామాన్య కర్యకర్త వరకూ అంటారు. కానీ బాబు గారు చేసిందేంటి. తెలంగాణాలో  కాంగ్రెస్ తో పొత్తు, కేంద్రంలో అంటకాగడం, అన్నీ కలసే ఇపుడు కొంప ముంచాయి. మరి ఈ తప్పు ఎవరిది. ఇక అటు సీఎం గా, ఇటు అధినేతగా బాబు తీసుకున్న‌ ఎన్నో ఏకపక్ష నిర్ణయాల ఫలితమే ఈ ఓటమి అని ప్రతీ కార్యకర్త మనో వేదన. దానికి జనం సీఎం పోస్ట్ లేకుండా చేశారు.


మరి పార్టీ అధినేతగా ఉండాలో మానాలో బాబే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే టీడీపీ మనగలగాలంటే మరో నాయకత్వం అవసరమని తమ్ముళ్ళే అంటున్నారు. అది సినీ హీరో  జూనియర్ అని కూడా వారే సూచిస్తున్నారు. మరి బాబు గారు తన తప్పులకు రివ్యూ చేసుకుని తప్పుకునే డేరింగ్ స్టెప్ తీసుకోగలరా. రాజకీయంగా ఎంతో జూనియర్ అయిన రాహుల్ చూపిన దారిలో బాబు నడవగలరా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: