గురువారం సాయంత్రం రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో వరుస భేటీలతో మంత్రివర్గ కూర్పుపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మంతనాలు జరుపుతున్నారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే అంశంతో పాటు మంత్రిత్వశాఖల కేటాయింపుపై ప్రధాని నరంద్రమోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నేతలతో షా సమావేశమై మంత్రి పదవుల విషయంపై చర్చలు జరిపారు. అయితే ఈ చ‌ర్చ‌ల్లో అమిత్‌షాకు కీల‌క శాఖ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం.


కీలకమైన ఆర్థిక శాఖకు జైట్లీ స్థానంలో షా పేరును పరిశీలిస్తున్నారు. తనకు మంత్రిపదవి వద్దంటూ ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి చేయడంతో ఆ శాఖను అమిత్ షాకు కేటాయించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజ్యసభ సభ్యుడైన షా గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రికార్డు మెజార్టీ(5.57లక్షలు)తో ఎంపీగా గెలుపొందారు. తాజాగా, బుధవారం ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. 


సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు కేబినెట్‌లో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్, గడ్కరీ, స్మృతీ ఇరానీలకు కీలక పదవులు కేటాయించనున్నారు. త్వరలో ఎన్నికల జరగనున్న రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకొని మంత్రుల కేటాయింపు ఉంటుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: