చంద్రబాబునాయుడు ఆలోచనలు మరీ ఇంత అన్యాయంగా ఉంటాయని ఎవరూ అనుకోలేదు. అలాగే ఉంది తెలుగుదేశంపార్టీ నేతల మాటలు వింటుంటే. తెలుగుదేశంపార్టీ శాసనసభా పక్ష సమావేశం చంద్రబాబునాయుడు అండ్ కో మాట్లాడుతూ టిడిపి మీద జనాల్లో వ్యతిరేకతే లేదట. కాకపోతే జగన్మోహన్ రెడ్డిపై సానుభూతితోనే జనాలు వైసిపికి ఓట్లేశారని తమను తాము ఓదార్చుకుంటున్నారు.

 

ఐదేళ్ళ పాలనలో పేదలకు, వివిధ వర్గాలకు తాను చేయగలిగినంత సాయం చేశానని చంద్రబాబు అనుకుంటున్నారు. అయినా జనాలు టిడిపిని ఓడించటం ఆశ్చర్యంగా ఉందట. ప్రజల్లో చంద్రబాబు పై ఏ విధమైన వ్యతిరేకతా లేదని టిడిఎల్పీ సమావేశంలో తీర్మానించేశారు ఎంఎల్ఏలు.

 

గడచిన ఆరు రోజులుగా తనను కలస్తున్న అనేక మందిలో ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయాన్ని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఆరు రోజులుగా చంద్రబాబును కలిసిందంతా టిడిపి శ్రేణులే. వాళ్ళంతా గెలిచిన వైసిపిని నిందించటంలో వింతేమీ లేదు. వాళ్ళంతా చంద్రబాబే బ్రహ్మాండమంటారు. చంద్రబాబుతో మాట్లాడుతున్నపుడు పాలన చెత్తగా ఉంది కాబట్టే జనాలు వైసిపికి ఓట్లేస్తారని చెబుతారా ?

 

ఏమిటో చంద్రబాబు ఐదేళ్ళు ఇలాగే భ్రమల్లో బతికేశారు. క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతోందో చూసుకోకుండా ఊహాప్రపంచంలో ఉండటం వల్లే కోలుకోలేని విధంగా దెబ్బ పడింది. సీనియర్ ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి చెప్పింది ఇదే కదా ? బుచ్చయ్య  మాట్లాడుతూ క్షేత్రస్ధాయిలో పార్టీని పట్టించుకోకుండా ప్రతీదానికి టెక్నాలజీ వెంట పడటం, నేతల్లోని అసంతృప్తిని పట్టించుకోకపోవటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 

తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచిన తనలాంటి సీనియర్ల మాటలను చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదని బుచ్చయ్య నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీలో సమస్యలను ఎప్పుడు ప్రస్తావించినా చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.  బహుశా బుచ్చయ్య ఫీలింగ్సే అందరిలోను ఉండుంటుంది. కాకపోతే బుచ్చయ్య బయటకు చెప్పారు. మిగిలిన వాళ్ళకు చెప్పే అవకాశం రాలేదంతే. లోపాలన్నీ చంద్రబాబులోను పార్టీలోను పెట్టుకుని పార్టీపై జనాల్లో వ్యతిరేకత లేదని తీర్మానించేసుకుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఇదే గతి.


మరింత సమాచారం తెలుసుకోండి: