ఈ ఫోటో చూశారు కదా… ఇందులో కనిపిస్తున్న వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడు… ఈయనను ‘ఒడిశా మోడీ’ అని పిలుస్తుంటారు… ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఒడిశాకు వచ్చినా సరే ఈ మోడీని కలవకుండా వెళ్లడు… వావ్… ఎవరాయన… ఈయనే..! వెనుక కనిపిస్తున్నది తన ఇల్లే… ఆ పైన గడ్డి కప్పాల్సి ఉంది ఇంకా… భుజానికి ఓ సంచీ, కాళ్లకు ఆకుచెప్పులు… ఆయన ఎప్పుడు చూసినా అలాగే కనిపిస్తాడు… ఓ సైకిల్‌పై తిరుగుతూ… చిన్న పిల్లలతో ఆడుతూ… మారుమూల తండాలకు కాలినడక వెళ్తూ… స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తాడు… ఎవరు ఏం పెట్టినా తినేస్తాడు.


ఆలస్యమైతే ఏ గుడిసె ముందో కుక్కిమంచం వేయించుకుని పడుకుంటాడు… రోడ్డు పక్కన బోరింగు వద్ద స్నానం చేస్తాడు… దగ్గరలో ఏదైనా గుడి ఉంటే వెళ్లి, కాసేపు పూజ చేసుకున్నాడంటే చాలు, ఇక ప్రయాణమే ప్రయాణం… ఏదైనా దూర ప్రయాణం అనుకొండి, వెంట ఓ బ్యాగు ఉంటుంది… అంతే… ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు, తన కోటాకు వచ్చే అభివృద్ధి నిధులన్నీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు, స్కూళ్లకు వెచ్చించేస్తాడు… తను పెళ్లి చేసుకోలేదు… తల్లి ఉండేది, గత ఏడాది మరణించింది… వేరే ఆస్తిపాస్తులేమీ లేవు… నిఖార్సయిన నిరాడంబర జీవితం తనది… ఒక్క ముక్కలో చెప్పాలంటే తను సన్యాసి… తనకంటూ వేరే సుఖదుఖాలు లేకుండా బతికే ఓ పరిత్యాగి.


 నమ్మడం లేదు కదా…  తన పేరు, ప్రతాప్ చంద్ర సారంగి… చెప్పుకోవటానికి చాలా ఇంట్రస్టింగు కథ ఉంది… అలా ఒడిశాలోని బాలాసోర్ దాకా వెళ్లొద్దాం పదండి… 1955… నీలగిర్ ప్రాంతంలోని గోపీనాథపురం, ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు… ఉత్కళ యూనివర్శిటీ పరిధిలోని బాలాసోర్‌లోనే డిగ్రీ వరకూ చదివాడు… మంచి వక్త… ఆధ్యాత్మిక జీవితంపై అనురక్తి… డిగ్రీ కాగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి, ప్రజాసేవకు అంకితం కావాలనేది ధ్యాస… పలుసార్లు బేలూరు మఠం వెళ్లాడు… తన బయోడేటా పరిశీలిస్తూ తనకు విధవరాలైన తల్లి ఉందనీ, ఊళ్లో ఒక్కతే ఉంటుందని తెలిసి అక్కడి గురువులు తనను మందలించారు… తల్లి సేవ చేసుకోపో అని నచ్చజెప్పి పంపించేశారు.


ఊరూరూ తిరుగుతూ జనాలకు కావల్సిన పనులు చేసిపెడుతూ తిరిగేవాడు… గణశిక్షామందిర్ యోజన కింద గిరిజన గ్రామాల్లో సమరకరకేంద్రాల పేరిట బడులు ప్రారంభించటానికి ఎక్కువగా కృషి చేసేవాడు. చదువు ఉంటే చైతన్యం, ఆరోగ్యం, సంపద అన్నీ సమకూరతాయని నమ్మే వ్యక్తి తను… బీజేపీ తనను పికప్ చేసుకుంది… 2004లో నీలగిర్ టికెట్టు ఇచ్చింది… గెలిచాడు… 2009లో మళ్లీ నిలబడ్డాడు, మళ్లీ గెలిచాడు… ఎమ్మెల్యేగా గెలిచినా, పదేళ్లు పనిచేసినా తన లైఫ్ స్టయిల్ అదే..


ఈసారి 2014లో పార్టీ బాలాసోర్ ఎంపీ టికెట్టు ఇచ్చింది… టఫ్ సీటు, ఇది కాంగ్రెస్‌కు గతంలో పెట్టని కోట… తరువాత సీపీఐ వశమైంది… ఆ తరువాత బిజూజనతాదళ్ గెలిచింది… బీజేపీకి కొరుకుడపడని సీటు… ఓడిపోయాడు…2019… అంటే మొన్న మళ్లీ టికెట్టు… గెలిచాడు… 13 వేల వోట్ల మెజారిటీతో గెలిచి, తను పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు.


గెలిచేవాళ్లలో రకరకాల లైఫ్ స్టయిల్స్ ఉన్నవాళ్లూ ఉంటారు… కానీ పక్కాగా ఓ నిజమైన ప్రజాసేవకుడు, తనకంటూ ఏమీ సంపాదించుకోనివాడు, వచ్చిందంతా ప్రజలకే ఖర్చుచేసేవాడు, నిరాడంబరుడు ఎంపీగా గెలవటాన్ని ఈరోజుల్లో ఊహించుకొండి ఒక్కసారి…వందలు, వేల కోట్ల ఆస్తులు, ఆడంబరాలు, అట్టహాసాలు, మితిమీరిన సంపాదన… అసలు మన ఎంపీలంటే మజాకా…  2014లో ఆయన ఆస్తుల అఫిడవిట్టులో తను చూపిన ఆస్తి ఆ గుడిసె కమ్ ఇల్లు… ఇంకెక్కడో కాసింత జాగా… మొత్తం తన ఆస్తి 10 లక్షలు.


ఎంపీలకు జీతభత్యాలు ఎక్కువుంటాయి… ఎంపీల్యాడ్స్ నిధులూ ఎక్కువే మరి సరదాగా అడిగితే… ఓహో… ఇంకొన్ని స్కూళ్లకు పక్కా బిల్డింగులు నా నిధులతోనే కట్టవచ్చునన్నమాట అంటాడు తను…ఇంకాస్త సరదాగా అడిగిచూడండి, డిల్లీలో ఎక్కడుంటావ్ సారూ అని ఏం..? ఢిల్లీలో రైల్వే ప్లాట్‌ఫారాలుండవా..?  రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఉండవా అంటాడు తను…


 అంత నిరాడంబరుడు… వావ్… నిజమైన ప్రజాసేవకులు…అయ్యా, స్వామీ… నువ్వు మొదట్లో కోరుకున్నట్టు సన్యాసివి అయినా సరే, నీకు దొరికే ముక్తి ఏమిటో తెలియదు గానీ… ఇప్పటి నీ జీవనసరళితో మాత్రం నీకు లభించేది ఖచ్చితంగా కైవల్యమే…!!



మరింత సమాచారం తెలుసుకోండి: