గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో నిలిచిన‌ ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీ ఎంపిక పూర్త‌యింది. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్ ఏపీ కొత్త డీజీపీగా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్‌ స్టేషనరీ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇక..ఏసీబీ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం..ఆ  స్థానంలో కుమార్ విశ్వజిత్‌ను నియమించింది.  అలాగే.. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. కాగా, ఏసీబీ మాజీ డీజీ వెంకటేశ్వరరావుకి  ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.


సవాంగ్‌కు డీజీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వెనుక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్ని విధాలుగా ఆలోచించార‌ని స‌మాచారం. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా, 2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. 2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్రవేశారు. గతేడాది జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఆయ‌న డీజీపీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 


కాగా, విధుల నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డా స‌వాంగ్‌ ప్ర‌వ‌ర్త‌న వివాదాస్ప‌దం కాలేదు. నియ‌మ‌నిబంధ‌న‌లు పాటిస్తూ, ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా స‌వాంగ్ అందించిన సేవ‌ల వ‌ల్లే జ‌గ‌న్ ఆయ‌న్ను డీజీపీగా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. శుక్ర‌వారం స‌వాంగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: