కేంద్ర కేబినెట్ లో తెలంగాణ కు మంత్రి పదవి దక్కినప్పటికీ, ఆంధ్ర నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదు . అలాగే తమిళనాడు కు ప్రధాని మోడీ మొండి చెయ్యి చూపించాడు. ఉత్తరప్రదేశ్ కు అగ్ర తాంబూలం అందించిన మోడీ , మహారాష్ట్ర , బీహార్ , మధ్యప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాలకు మంత్రి వర్గ కూర్పు లో అధిక ప్రాధ్యానత ఇచ్చారు. తన మంత్రి వర్గం లో ఆరు మంది మహిళలు చోటు కల్పించిన మోడీ, విస్తరణ లో మరికొంతమంది అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెల్సింది.  


 రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి గా రెండవసారి  ప్రమాణస్వీకారం చేసిన మోడీ, తన మంత్రివర్గ సహచరులుగా 58  మందికి అవకాశం కల్పించారు. 25 మందికి కేబినెట్ హోదా కల్పించిన మోడీ, 9  మందికి స్వతంత్ర  కేంద్ర  మంత్రుల హోదాను కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక 24 మంది కి  కేంద్ర సహాయమంత్రుల హోదా కల్పించారు. కేంద్ర మంత్రి పదవుల్లో సింహభాగం బిజెపి కి చెందిన నేతలే మంత్రి పదవులు దక్కించుకోగా, ఇతర భాగస్వామ్య పక్షాలకు ఒకొక్క మంత్రి పదవి చొప్పున కేటాయించారు. ఇక రెండు మంత్రి పదవులను  బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ఆశించగా  బిజెపి ససేమిరా అనడం తో జనతాదళ్ యునైటెడ్  పార్టీ కేబినెట్ లో చేరేందుకు విముఖతకు వ్యక్తం చేసింది.


కేంద్ర మంత్రి పదవుల్లో ఉత్తరప్రదేశ్,  మహారాష్ట్ర లకు అత్యధికంగా తొమ్మిది,  ఎనిమిది మంత్రి పదవులు చొప్పున  కేటాయించిన మోడీ, బీహార్ కు చెందిన ఆరు మంది ప్రజాప్రతినిధులను తన  మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి నలుగురికి  , మధ్యప్రదేశ్ నుండి ఐదు మందికి అవకాశాన్ని కల్పించిన మోడీ,  సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ముగ్గురు, హర్యానా నుంచి మరో ముగ్గుర్ని కేబినెట్ లో చేర్చుకున్నారు . లోక్ సభ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి బిజెపి కి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, ఏపీ లో బలపడాలని చూస్తున్న ఆ పార్టీ జాతీయ నాయకత్వం , కేంద్ర మంత్రి వర్గం లోకి రాష్ట్రానికి చెందిన నేతల్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదని భావించారు. తెలంగాణ కు చెందిన బిజెపి ఎంపీ కిషన్ రెడ్డి ని మంత్రి వర్గం లోకి తీసుకున్న పార్టీ నాయకత్వం రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం బాధ్యలను ఆయన భుజస్కందాలపైనే మోపే అవకాశాలున్నట్లు తెల్సుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: