అస్సాంకు చెందిన గౌతమ్‌ సవాంగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ప్రాథమిక విద్య అభ్యసించారు. గ్రాడ్యుయేషన్‌ చెన్నై లయోలా కాలేజీ, పీజీ ఢిల్లీ యూనివర్శిటీలో సాగింది. ఐపీఎస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ ఏపీ కేడర్‌ అధికారి. ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. సవాంగ్‌ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఏపీ గ్రేహౌండ్స్‌ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా సేవలందించారు. తను పనిచేసిన ప్రతిచోటా, అధికారుల మన్ననలు అందుకున్నారు.

సవాంగ్ ను కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి డీజీపీగా నియమించినట్టు తెలుస్తోంది. ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో బెజవాడ రౌడీ మూకల ఆటలు కట్టించడంతో పాటు... అరాచక శక్తుల ఆటలు కట్టించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతపై ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా, ఎక్కడైనా అరాచక శక్తులు ఉన్నట్టయితే వాటిని కూకటి వేళ్లతో పెకళించి వేసేందుకు వీలుగా సవాంగ్‌ను జగన్ కేంద్ర హోంశాఖను ఒప్పించి మరీ డీజీపీగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. 2018 వరకు సీపీగా పని చేసిన ఈయన.. సంఘ వ్యతిరక శక్తులను అణిచివేయడంలో కీలక పాత్రను పోషించారు.

2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌ల్లో పనిచేశారు. ఏసీబీ, ఎస్‌ఐబీ వింగ్‌లో విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేసి, తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో ఆయనకు డీజీగా పదోన్నతి వచ్చింది. సవాంగ్‌ను డీజీపీగా నియమిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సవాంగ్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: