అగ్ర‌రాజ్యం అమెరికా షాకుల ప‌రంప‌ర‌లో ఇది మ‌రొక‌టి. వీసా నిబంధ‌న‌ల్లో అమెరికా మ‌రోమార్పు చేసింది. ఇకపై అమెరికా వెళ్లాలంటే సోషల్ మీడియా వివరాలు తప్పక చెప్పాల్సిందే. ఈమేరకు కొత్త వీసా నిబంధనలు అమలులోకి వచ్చాయి. యూఎస్‌కు వచ్చే అత్యధిక విదేశీయుల్లో ఉగ్రవాదులు, ప్రమాదకర వ్యక్తులను గుర్తించేందుకు ఈ కొత్త వీసా విధానాన్ని ఆ దేశ విదేశాంగశాఖ శనివారం ప్రవేశపెట్టింది. త‌ద్వారా మ‌రింత క్షుణ్ణంగా అభ్య‌ర్థుల వివ‌రాల‌ను అధ్య‌య‌నం చేయ‌నుంది. 


నూత‌న నిబంద‌న‌ల ప్ర‌కారం, ఇకపై తాత్కాలిక సందర్శకులు కూడా వీసా దరఖాస్తులో తమ వ్యక్తిగత సమాచారంతో పాటు డ్రాప్‌డౌన్ మెనూలో ఉన్న సోషల్ మీడియా వివరాలను తప్పక వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ సామాజిక మాధ్యమాలను వినియోగించకపోతే ఆ విషయాన్ని పేర్కొన్నాలి. అయితే సోషల్ మీడియా వినియోగంపై తప్పుడు సమాచారం ఇచ్చినవారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవా ల్సివస్తుందని అమెరికా విదేశాంగశాఖ అధికారి హెచ్చరించారు.


ప్రస్తుతం అమెరికా ఆన్‌లైన్ వీసా దరఖాస్తులో కొన్ని ప్రముఖ సోషల్ మీడియాలు మాత్రమే ఉన్నాయని, త్వరలో అన్ని సోషల్ మీడియా వివరాలను అందులో పొందుపరుస్తామన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఐదేండ్ల ఈ-మెయిల్స్ రిపోర్ట్, ఫోన్ నెంబర్లను కూడా జత చేయాలన్నారు. వర్క్, స్టడీ వీసాదారులందరికీ ఇది వర్తిస్తుందని, అధికార, ద్వైపాక్షిక వీసాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పా రు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు సోషల్ మీడియాలో క్రీయాశీలకంగా ఉంటున్నారని, ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా అమెరికాలో అడుగుపెట్టే విదేశీయులపై మరింత నిఘాపెట్టే అవకాశమున్నదని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు, ప్రమాదకర వ్యక్తులను నిరోధించడంతోపాటు ప్రజా రక్షణకు వాటిల్లే ముప్పును నివారించవచ్చని స్పష్టంచేశారు. భవిష్యత్తులో వీసా దరఖాస్తుదారులు తమ ప్రయాణాలకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: