ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. ఆయ‌న న‌వ్యాంధ్ర సీఎం అయ్యాక ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ కొండెక్కేసింది. ఆయ‌న మాట టీడీపీలో సీనియ‌ర్లు కాదు క‌దా.. క‌నీసం తొలిసారి గెలిచిన జూనియ‌ర్లు కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఏదో ఆదినారాయ‌ణ‌రెడ్డి - రామ‌సుబ్బారెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం - గొట్టిపాటి ర‌వి లాంటి వాళ్ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేశాన‌ని బాబు గొప్ప‌లు పోయినా చాలా మంది ఆయ‌న్ను అస్స‌లు లెక్క‌చేయ‌లేదు. అంతెందుకు ఈ సారి ఎన్నిక‌ల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను త‌ప్పించాల‌ని ఆయ‌న చూసినా.. వాళ్ల‌లో చాలామంది బెదిరించి మ‌రీ మ‌ళ్లీ సీటు తెచ్చుకున్నారు.


రాయ‌పాటి లాంటి వాళ్లు క‌న్నెర చేయ‌బ‌ట్టే చంద్ర‌బాబు జ‌డిసిపోయి మ‌రీ ఆయ‌న‌కు న‌ర‌సారావుపేట ఎంపీ సీటు ఇచ్చేశారు. ఇక ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో చాలా మంది ద్వితీయ శ్రేణి నేత‌లే కాకుండా మంత్రులు చెప్పిన ఆబ్లిగేష‌న్ల‌కు కూడా సీట్లు ఇచ్చారు. అలా వాళ్లు ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఓవ‌రాల్‌గా అర్థ‌మ‌వుతోంది ఏంటంటే చంద్ర‌బాబు మాట‌ను లెక్క‌చేసే వారి సంఖ్య పార్టీలో ఎక్కువ అవుతోంది. కొంద‌రు భ‌య‌పెడుతుంటే.. మ‌రికొంద‌రు బెదిరిస్తూ బాబును లెక్క‌చేయ‌డం లేదు.


ఇక తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఉదంత‌మే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. కేశినేనికి బాబు లోక్‌స‌భ‌లో పార్టీ త‌ర‌పున విప్ ప‌ద‌వి కేటాయించారు. తనకు విప్ పదవి వద్దని, దాన్ని తనకన్నా సమర్థులకు కేటాయించాలని చంద్రబాబుకు ఉచిత సలహా ఇచ్చి తన అసంతృప్తిని బాహాటంగా చాటారు. ఇదంతా నాని త‌న పేస్‌బుక్‌లో కూడా పెట్టారు. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన రాద్దాంతం జ‌రిగిపోయింది. చివ‌ర‌కు గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ నాని ఇంటికి వెళ్లి బ‌తిమిలాడాల్సిన ప‌రిస్థితి. 


చంద్ర‌బాబు ఫోన్ చేసినా నాని ఎత్తక‌పోవ‌డంతో చివ‌ర‌కు బాబు బుద్ధా వెంక‌న్న లాంటి వాళ్ల‌తో తనను వచ్చి కలవమని కేశినేని నానికి సందేశం పంపార‌ట‌. ఇక జ‌య‌దేవ్ నాని ఇంటికి వెళ్లిన‌ప్పుడు కొంద‌రు టీడీపీ నేత‌లు త‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌ని.. అయితే చంద్ర‌బాబు ఫోన్‌కు స్పందించ‌ని నాని.. చివ‌ర‌కు త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన దూత‌ల ద‌గ్గ‌ర కూడా చాలా ఫైర్ అయ్యార‌ట‌. ఈ ఎన్నిక‌ల్లో తనను ఓడించాలని కొంతమంది తెలుగుదేశం నేతలు ప్రయత్నించారని, వారికి చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా వాపోయారట.


నాని ప‌రోక్షంగా మాజీ మంత్రి దేవినేని ఉమాపైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదే క్ర‌మంలో ఇక్క‌డ టీడీపీ పార్టీ నిర్మాణం బాధ్య‌త‌లు ముందుగా నానికి అప్ప‌గించిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ఆయ‌న‌కు చెప్పాపెట్ట‌కుండా ఉమాకు అప్ప‌గించ‌డంపై కూడా నాని కినుక వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. ఎట్టకేల‌కు బుధ‌వారం సాయంత్రానికి జ‌య‌దేవ్ నానిని వెంట‌పెట్టుకుని బాబు ఇంటికి వెళ్ల‌గా అక్క‌డ ఆయ‌న నానితో ఏకాంతంగా మాట్లాడ‌డంతో నాని త‌న బాధ‌ను చెప్పుకుని కాస్త మెత్త ప‌డిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: