తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఫ‌లితాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు మెజార్టీ శాతం ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తున్నారు. రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫ‌లితాల‌ను బట్టి చూస్తుంటే దాదాపుగా మండ‌ల ప‌రిష‌త్, జిల్లా ప‌రిష‌త్ పీఠాల‌ను అధికంగా టీఆర్ఎస్ కైవ‌సం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.


ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల అధికారులు ఓట్లు లెక్కిస్తున్న‌ స‌మ‌యంలో బ్యాలెట్ ప‌త్రాల‌తో పాటుగా ప‌లు ఉత్త‌రాలు కూడా వెలుగు చూశాయి. ఓట‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ఓట్ల‌తో పాటు లెట‌ర్ల‌తోనూ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయా లెట‌ర్ల‌లో స‌మ‌స్య‌లు విన్న‌వించుకుంటే..జ‌గిత్యాల జిల్లాకు చెందిన బ్యాలెట్ బాక్సులో ల‌భించిన‌ ఓ లెట‌ర్లో మాత్రం విచిత్ర‌మైన విన్న‌పం కనిపించింది. అది ఏంటంటే…


”సీఎం కేసీఆర్ గారికి వ్రాయునది ఏమనగా నేను జగిత్యాల జిల్లా వాసిని. మా జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదు. దాని వల్ల మా జిల్లా వాసులు వేరే జిల్లాకు వెళ్లి మరీ కింగ్ ఫిషర్ బీర్లు తాగుతున్నారు. కావున మా యందు దయతలచి మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉంచగలరు.


నోట్: కింగ్ ఫిషర్ బీర్ల కోసం మా జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయగలరు. ఇట్లు జగిత్యాల జిల్లా వాసులు” అని రాసి ఉంది.


ఈ లెట‌ర్ చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఎవ‌రైనా వారి వారి గ్రామాల్లో రోడ్లు లేవ‌ని,మంచినీరు ల‌భించ‌డం లేద‌ని, డ్రైనేజీ సిస్టం స‌రిగ్గాలేదని, త‌మ పంట‌ల‌కు గిట్టుబాట ధ‌ర ల‌భించ‌డం లేద‌ని,త‌మ‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని, ఇలా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే స‌మస్య‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌డం చూశాం. కానీ, ఫ‌స్ట్ టైం ఇలా మ‌ద్య‌పానీయాల గురించి కూడా సీఎంను ఉద్ధేశిస్తూ లెట‌ర్ రాయ‌డం విచిత్రంగా ఉంది. ప్ర‌స్తుతానికి ఈ లెట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ లెట‌ర్ రాసిన ఆ ప్ర‌బుద్ధుడు ఎవ‌రై ఉంటారా అని జ‌గిత్యాల జిల్లాలోని గ్రామ‌స్తులు చ‌ర్చించుకుంటున్నారు.


మొత్తానికి మ‌రి..ఆ ప్ర‌బుద్ధుడి కోరిక‌ను కేసీఆర్ గారు ప‌ట్టించుకుని బీర్లు అందుబాటులోకి తీసుకువ‌స్తారో లేదంటే.. ఏకంగా జిల్లానే విలీనం చేస్తారో చూడాలి అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: