రాజ‌కీయ యుద్ధంలో ఓట‌మెర‌గ‌ని ధీరులు క‌ల్వ‌కుంట్ల కుటుంబీకులు..రాష్ట్రంలో ఎక్క‌డ పోటీ చేసినా గెలిచి తీరాల్సిందే..మెజార్టీ పెరగాల్సిందే. ఎవ‌రికైనా ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ప‌ట్టు ఉంటుంది.కానీ, కేసీఆర్ లాంటి వీరోచిత యోధునికి ఎక్క‌డ పోటీ చేసినా తిరుగుండ‌దు.అది సిద్దిపేట ఐనా,క‌రీంన‌గ‌ర్ ఐనా,మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఐనా,మెద‌క్ ఐనా,గ‌జ్వేల్ ఐనా..! ఇలా ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగినా గెలుపు ముంగిట వాలాల్సిందే. కేసీఆర్ కు మాత్ర‌మే కాదు..ఆయ‌న త‌లుచుకుంటే ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం ఎక్క‌డ పోటీ చేసినా ఓట‌మి అనే ప‌దం దానంత‌ట అది పారిపోవాల్సిందే. అందుకే,కొడుకు సిరిసిల్ల‌లో,కూతురు నిజామాబాద్ లో నిలదొక్కుకోగలిగారు.

కానీ, ఇదంతా ఒక‌ప్పుడు..ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింది. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో ఓట‌మికి తావులేదు అనే పేజీని తిర‌గ‌రాయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిజామాబాద్ లోక్‌స‌భ నుంచి క‌ల్వ‌కుంట్ల త‌న‌య క‌విత‌ రెండో సారి పోటీ చేసి మొదటి సారి ఓట‌మిని చ‌విచూడ‌టంతో..ఎంత‌టి ధీరుడికైనా ఓట‌మి త‌ప్ప‌దు అనే కొత్త పేజీని లిఖించాల్సి వ‌చ్చింది.

స‌రే..రాజ‌కీయ యుద్ధంలో గెలుపోట‌ములు స‌హ‌జం.కానీ, క‌విత ఓట‌మి కూడా అంతే అనుకుంటే స‌రిపోతుందా..? ఆమె మామూలు క‌విత అయితే ఓట‌మిని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌క్క‌ర్లేదు.కానీ, క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌రుడి కూతురు కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ప‌ట్టించుకోవాల్సిందే.ఎందుకంటే ఆమె కూడా భ‌విష్య‌త్తులో ముఖ్య‌మంత్రి అయ్యే స‌త్తా,సామ‌ర్థ్యం ఉన్న నాయ‌కురాలు కాబ‌ట్టి..ఆమె ఓట‌మిని అంత ఈజీగా తీసుకోలేం.మ‌న‌మే కాదు.. ప్ర‌స్తుతం క‌ల్వ‌కుంట్ల కుటుంబం సైతం క‌విత ఓట‌మిని అంత ఆషామాషీగా తీసుకోవ‌డం లేదు.ఆమె ఓట‌మిని జీర్ణించుకోవ‌డం అయ్యే ప‌ని కాదు,కాబట్టే..ఆమెను తిరిగి ప్ర‌జాక్షేత్రంలో నిల్చోబెట్టి గెలిపించుకోవాలన్న క‌సితో పావులు క‌దుపుతోంది క‌ల్వ‌కుంట్ల కుటుంబం.

ఎలాగు ఖాళీ కాబోతున్న హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ బ‌రిలో క‌విత‌ను నిలిపేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ట కుటుంబ స‌భ్యులు.వాళ్లే కాదు,టీఆర్ఎస్ శ్రేణులు సైతం క‌విత‌ను పోటీకి దింపాల్సిందే అని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇక ఆమె పోటీ ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌ నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర‌మంత‌టా జోరుగా సాగింది.కానీ,ఎక్క‌డ రివ‌ర్స్ కొట్టిందో తెలియ‌దు కానీ, ఒక్క‌సారిగా క‌విత పోటీ చేయ‌ట్లేద‌న్న‌ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పోటీ చేయాల్సిందే అని కేసీఆర్ ప‌ట్టుప‌ట్టినా క‌విత మాత్రం స‌సేమిరా అంటోంద‌ట‌,ఆమె పోటీ చేసేందుకు సుముఖంగా లేర‌ట‌,బ‌హుశా ఇప్పుడ‌ప్పుడే ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌.ఎక్క‌డ పోగొట్టుకున్నానో..అక్క‌డే వెతుక్కుంటా అంటున్నార‌ట‌.నిజామాబాద్ లో ఓడిస్తే హుజూర్ న‌గ‌ర్లో గెలుస్తానా..అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట క‌విత‌.అదేంటి..నిన్న‌టివ‌ర‌కు క‌విత క‌న్ఫాంగా పోటీ చేస్త‌ద‌ని చెప్పారుగా..స‌డెన్ గా ఇదేంటి ఈ ఆవేద‌న ఎందుకు అనేది ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.

వాస్త‌వానికి క‌విత పోటీ చేయ‌క‌పోవ‌డానికి ప‌లు కార‌ణాలున్నాయట‌.. ఈసారి గ‌న‌క క‌విత పోటీ చేస్తే ఆమెపై పోటీకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగ‌డ‌ను తీసుకురానుంద‌ట‌. నిజామాబాద్ లో ఏ విధంగానైతే క‌విత‌పై వంద‌లాది మంది ప‌సుపు రైతులు పోటీ చేశారో,హుజూర్ న‌గ‌ర్లోనూ అలాగే వంద‌లాది మందిని పోటీకి దింపే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగా చ‌నిపోయిన ఇంట‌ర్ విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను,అలాగే తెలంగాణ ఉద్య‌మంలో అమ‌రులైన వారి త‌ల్లిదండ్రుల‌ను పోటీకి దింపే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. అంతే కాదు, టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వ‌చ్చి తొలి అమ‌రుడైన శ్రీకాంతాచారి త‌ల్లిని పోటీకి దింపే అంశంపై కూడా వారు చ‌ర్చించార‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నందున‌..వాట‌న్నింటినీ క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఖ‌త‌ర్నాక్ ప్లాన్ కు శ్రీకారం చుట్ట‌బోతుంద‌ట‌. క‌విత‌పై వంద‌లాది నామినేష‌ష‌న్ల‌ను వేయించి,రెండోసారి కూడా ఓడించ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో త‌ప్ప‌కుండా టీఆర్ఎస్ పార్టీపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఎత్తుగ‌డ‌కు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంద‌ట‌.

ఈ కార‌ణాల వ‌ల్లే క‌విత పోటీకి దూరంగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.మొత్తానికి క‌విత పోటీ చేయ‌క‌పోయినా.. హుజూర్ న‌గ‌ర్లో మాత్రం గులాబీ జెండా ఎగ‌ర‌నివ్వ‌బోమ‌ని, అవ‌స‌ర‌మైతే ప్రొఫెస‌ర్ కోదండ‌రాంను కానీ, శ్రీకాంత‌చారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌ను కానీ పోటీకి దింపి గెలిపించుకునేందుకు ఇప్ప‌టినేంచే తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ట కాంగ్రెస్.


మొత్తానికి క‌విత పోటీ చేసినా..చేయ‌కున్నా టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో మాత్రం ఎన్నిక‌ల క‌న్నా ముందే ఓట‌మి భ‌యాన్ని పుట్టించ‌డంలో కాంగ్రెస్ స‌క్సెస్ అయింద‌న్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్లిందని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.


మొత్తానికి జ‌నాలు మాత్రం…క‌విత ఓట‌మికి భ‌య‌ప‌డే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నార‌ని కొంద‌రు, కాదు కాదు నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం దాటి బ‌య‌టికి రావ‌ద్దునుకుంటున్నారని మ‌రికొంద‌రు..ఇలా ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వారు చ‌ర్చించుకోవ‌డం జ‌రుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: